Chitties merchent
-
6 కోట్లతో పరారైన రిటైర్డ్ టీచర్
కాజీపేట అర్బన్: తోటి ఉద్యోగులను, బంధువులను చిట్టీలు, వడ్డీల పేరిట మోసం చేశాడు ఓ రిటైర్డ్ టీచర్. సుమారు రూ.6 కోట్లతో పరారైన రిటైర్డ్ టీచర్ బండారం గురువారం బాధితులు సుబేదారి పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. బాధితుల కతనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన బిల్లా రాజిరెడ్డి ముప్పై ఏళ్ల క్రితం హన్మకొండ సుబేదారి పరిధిలోని విజయ్‌పాల్‌కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. కరీమాబాద్‌లోని ఓ ఏయిడెడ్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు కొనసాగించి 2006లో రిటైర్ అయ్యాడు. మూప్పై ఏళ్ల నుంచి విజయ్‌పాల్‌కాలనీలో నమ్మకంగా ఉంటూ పదేండ్ల క్రితం చిట్టీలను ప్రారంభించాడు. తన తోటి ఉద్యోగులతో పాటు నగరంలోని కాశిబుగ్గ, కరీమాబాద్, హన్మకొండ తదితర ప్రాంతాల నుంచి సుమారు 75 మంది రిటైర్డ్ ఉద్యోగులు చిట్టీలలో చేరారు. కొంతకాలం చిట్టీలను సక్రమంగా నడిపి చిట్టీల డబ్బులను నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందించే వాడు. అదేవిధంగా చిట్టీలను పాడినవారికి వడ్డీల ఆశ చూపి చిట్టీల సొమ్మును తన వద్ద ఉంచుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలలుగా చిట్టీల డబ్బులను సకాలంలో అందించకపోవడంతో చిట్టీల సభ్యులు నిలదీడయం ప్రారంభించారు. దీంతో ఈనెల 6న రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు. సుమారు 80 మంది నుంచి నెలా నెలా చిట్టీ, వడ్డీల పేరిట 6 కోట్ల వరకు వసూల్ చేసి పారిపోయాడు. నిందితుడు రాజిరెడ్డి కోసం తన ఇంటి వద్దకెళ్లి విచారించగా తన భార్య సరైన సమాదానం చెప్పకపోవడంతో బాధితులు గురువారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. బంధువులను సైతం వదలని రాజిరెడ్డి.. చిట్టీల పేరిట తన తోటి ఉద్యోగులను, నగరంలోని వివిధ రిటైర్డ్ ఉద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన రాజిరెడ్డి తన మోసంలో బంధువులను సైతం వదల్లేదు. తన బంధువులు సుమారు 15 మంది నుంచి వడ్డీల ఆశ చూపి సుమారు 2 కోట్ల వరకు వసూల్ చేసాడు. కొన్ని నెలలు వడ్డీలను అందించి నమ్మకంగా వ్యవహరించి ప్రామిసరి నోట్లు, చెక్కులను అందించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో బాధితులు రాజిరెడ్డి కెనడాలో నివాసముంటున్న తన ఏకైక కుమార్తె వద్దకు పారిపోయి ఉంటాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిట్టీవ్యాపారి ఇంటి ఎదుట దంపతుల ఆందోళన
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన బిజిగిరి ప్రభాకర్ భార్య కవితతో కలిసి జమ్మికుంట పట్టణంలోని చిట్టీ వ్యాపారి రమేశ్ ఇంటి ఎదుట మంగళవారం బైఠాయించాడు. చిట్టీ పాడుకుని ష్యూరిటీగా ఇచ్చిన బ్లాంక్ చెక్కును చిట్టీ డబ్బులు మొత్తం చెల్లించన తర్వాత కూడా రమేశ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెక్కు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుడు ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలో ప్రభాకర్ గతంలో సెలూన్ షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్దనే కటింగ్ చేయించుకునే చిట్టీ వ్యాపారి రమేశ్ తన వద్ద చిట్టీ వేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్ రూ.9 లక్షల చిట్టీ వేశాడు. ప్రారంభమైన మొదటి నెలలోనే చిట్టీని యాక్షన్‌లో రూ.4.50 లక్షలకు పాడిన ప్రభాకర్ ష్యూరిటీగా రమేశ్‌కు బ్లాంక్ చెక్కు ఇచ్చాడు. అయితే రమేశ్ చిట్టీ డబ్బులు రూ.4.50 లక్షల కు బదులు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఈక్రమంలో ప్రతి నెల చిట్టీ డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభాకర్ సుమారు రూ.3.60 లక్షలు కట్టాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చిట్టీ కట్టలేనని చెప్పాడు. తనకు రావాల్సి డబ్బులు, బ్లాంక్ చెక్కు ఇవ్వాలని రమేశ్‌ను కోరాడు. చిట్టి వ్యాపారి మాత్రం చెక్కును కోర్టులో వేసి ప్రభాకర్‌కే నోటీసులు పంపించాడు. దీనిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య పంచాయతీ జరిగిందని, అందులో రూ.2 లక్షలు చిట్టి వ్యాపారికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభాకర్ ముట్టజెప్పాడు. అయినా చెక్కు ఇవ్వకపోవడంతో భార్యతో కలిసి ఆందోళనకు దిగాడు. తన వెంట సూపర్వాస్మ తెచ్చుకుని చెక్కు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించారు. ఇంటో రమేశ్ లేకపోవడంతో పరిస్థితిని ఆయన భార్యకు వారు వివరించారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఉదయం 9 నుంచి రాత్రి7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి న్యాయం చేస్తామంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
రూ.1.5 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్
సత్యవేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా సత్యవేడులో రాజ్యలక్ష్మి అనే చిట్టీల వ్యాపారి కోటిన్నర రూపాయలతో పరారైంది. బాధితుల కథనమిదీ.. పదేళ్లుగా రాజ్యలక్ష్మి తానప్ప మొదలి వీధిలో నివసిస్తూ చిట్టీల వ్యాపారం చేస్తోంది. పంచాయతీ పరిధిలో అందరికీ నమ్మకం కలిగేలా చిట్టీ డబ్బులు అందజేస్తోంది. అయితే, వారం రోజులుగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంటోంది. దీంతో చిట్టీలు కట్టిన సుమారు 200 మంది మహిళలు బుధవారం ఆరాతీయగా వారం రోజులుగా స్థానికంగా లేదని తేలింది. బెంగళూరు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో వారంతా సత్యవేడు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.