సుబేదారి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
కాజీపేట అర్బన్: తోటి ఉద్యోగులను, బంధువులను చిట్టీలు, వడ్డీల పేరిట మోసం చేశాడు ఓ రిటైర్డ్ టీచర్. సుమారు రూ.6 కోట్లతో పరారైన రిటైర్డ్ టీచర్ బండారం గురువారం బాధితులు సుబేదారి పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. బాధితుల కతనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన బిల్లా రాజిరెడ్డి ముప్పై ఏళ్ల క్రితం హన్మకొండ సుబేదారి పరిధిలోని విజయ్‌పాల్‌కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు.
కరీమాబాద్‌లోని ఓ ఏయిడెడ్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు కొనసాగించి 2006లో రిటైర్ అయ్యాడు. మూప్పై ఏళ్ల నుంచి విజయ్‌పాల్‌కాలనీలో నమ్మకంగా ఉంటూ పదేండ్ల క్రితం చిట్టీలను ప్రారంభించాడు. తన తోటి ఉద్యోగులతో పాటు నగరంలోని కాశిబుగ్గ, కరీమాబాద్, హన్మకొండ తదితర ప్రాంతాల నుంచి సుమారు 75 మంది రిటైర్డ్ ఉద్యోగులు చిట్టీలలో చేరారు. కొంతకాలం చిట్టీలను సక్రమంగా నడిపి చిట్టీల డబ్బులను నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందించే వాడు.
అదేవిధంగా చిట్టీలను పాడినవారికి వడ్డీల ఆశ చూపి చిట్టీల సొమ్మును తన వద్ద ఉంచుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలలుగా చిట్టీల డబ్బులను సకాలంలో అందించకపోవడంతో చిట్టీల సభ్యులు నిలదీడయం ప్రారంభించారు. దీంతో ఈనెల 6న రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు.
సుమారు 80 మంది నుంచి నెలా నెలా చిట్టీ, వడ్డీల పేరిట 6 కోట్ల వరకు వసూల్ చేసి పారిపోయాడు. నిందితుడు రాజిరెడ్డి కోసం తన ఇంటి వద్దకెళ్లి విచారించగా తన భార్య సరైన సమాదానం చెప్పకపోవడంతో బాధితులు గురువారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
బంధువులను సైతం వదలని రాజిరెడ్డి..
చిట్టీల పేరిట తన తోటి ఉద్యోగులను, నగరంలోని వివిధ రిటైర్డ్ ఉద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన రాజిరెడ్డి తన మోసంలో బంధువులను సైతం వదల్లేదు. తన బంధువులు సుమారు 15 మంది నుంచి వడ్డీల ఆశ చూపి సుమారు 2 కోట్ల వరకు వసూల్ చేసాడు.
కొన్ని నెలలు వడ్డీలను అందించి నమ్మకంగా వ్యవహరించి ప్రామిసరి నోట్లు, చెక్కులను అందించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో బాధితులు రాజిరెడ్డి కెనడాలో నివాసముంటున్న తన ఏకైక కుమార్తె వద్దకు పారిపోయి ఉంటాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment