Chocolate Flavor
-
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
Diwali Special 2021: ఘుమఘుమలాడే బనానా బటర్ బిట్స్, చాక్లెట్ పేడా తయారీ..
దీపాలవళి పండుగ వేళ ఈ వెరైటీ రుచులతో ఇంటి అతిధులను మరింత ఆనందపరచండి. బనానా బటర్ బిట్స్ కావలసిన పదార్ధాలు అరటిపండ్లు – 2 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి) పీనట్ బటర్ – పావు కప్పు బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు నువ్వులు (వేయించినవి) – అర టేబుల్ స్పూన్ చాక్లెట్ చిప్స్ – పావు కప్పు, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్ తయారీ విధానం ముందుగా పీనట్ బటర్, బాదం పౌడర్, నువ్వులు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకుని ఓవెన్లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. మరోవైపు ప్రతి అరటిపండు ముక్కపైన అర టీ స్పూన్ బటర్ మిశ్రమాన్ని పెట్టి.. దానిపైన మరో అరటిపండు ముక్కను ఉంచి.. ఆ బిట్స్‌ని ఒకొక్కటిగా మెల్ట్ అయిన చాక్లెట్ మిశ్రమంలో సగానికి ముంచి పెట్టుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత చాక్లెట్ మిశ్రమం గట్టిపడ్డాక సర్వ్ చేసుకోవాలి. చాక్లెట్ పేడా కావలసిన పదార్ధాలు మిల్క్ పౌడర్ – 1 కప్పు పంచదార చిక్కటి పాలు – పావు కప్పు చొప్పున నెయ్యి కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున డ్రై ఫ్రూట్స్ ముక్కలు – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, నాన్ స్టిక్ పాత్రలో మిల్క్ పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాల తర్వాత పంచదార, చిక్కటి పాలు, కోకో పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి వేసుకుని.. గరిటెతో కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని చల్లారనిచ్చి.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో డిజైన్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ముక్కలు పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
చాక్లెట్ చరితం
ఫ్లాష్ బ్యాక్ పిల్లల అభిమాన తాయిలం చాక్లెట్. పెద్దలకూ ఇది ప్రీతిపాత్రమే. ప్రతి ఆహార పదార్థానికీ చాక్లెట్ ఫ్లేవర్‌ను తగిలించేంతగా మనకు దగ్గరైపోయిందది. అయితే పాశ్చాత్యుల ప్రభావంతో చాక్లెట్ మన దేశానికి కాస్త ఆలస్యంగానే పరిచయ మైంది గానీ, దీని వెనుక దాదాపు నాలుగువేల ఏళ్ల చరిత్ర ఉంది. మాయన్లు, అజ్టెక్లు చాక్లెట్‌ను పానీయంగా తీసుకునేవారు. ఇప్పుడైతే చాక్లెట్‌ను తీపిగా తప్ప మరో రుచిలో ఊహించలేం గానీ, వాళ్లంతా చేదుగానే చాక్లెట్‌ను ఆస్వాదించేవారు. కోకో గింజలకు తేనె, వెనిల్లా, నీరు చేర్చి ఒకలాంటి పానీయాన్ని తయారు చేసుకునేవారు. కోకో గింజలను అజ్టెక్లు దేవతల ఆహారంగా భావించే వారు. ఆ గింజలనే కరెన్సీగా ఉపయోగించేవారు. మెక్సికన్ల నుంచి కోకో గింజలు పదహారో శతాబ్దంలో స్పెయిన్‌కు పరిచయ మయ్యాయి. శతాబ్దం తర్వాత స్పెయిన్ రాచ కుటుంబానికి, ఫ్రెంచి రాచ కుటుంబానికి వియ్యం ఏర్పడటంతో అచిరకాలంలోనే చాక్లెట్ రుచి యూరోప్ అంతటా విస్తరించింది. డచ్ కెమిస్ట్ కోవెన్రాడ్ జొహాన్నెస్ వాన్ హూటెన్ 1828లో కోకో ప్రెస్ యంత్రాన్ని రూపొం దించడంతో, తీపి తీపి మోడర్న్ చాక్లెట్ తయారీకి మార్గం ఏర్పడింది. బ్రిటిష్ కంపెనీ జె.ఎస్.ఫ్రై అండ్ సన్స్ తొలిసారిగా 1847లో చాక్లెట్ బార్‌ను మార్కెట్లోకి తెచ్చింది.