చాక్లెట్ చరితం
ఫ్లాష్ బ్యాక్
పిల్లల అభిమాన తాయిలం చాక్లెట్. పెద్దలకూ ఇది ప్రీతిపాత్రమే. ప్రతి ఆహార పదార్థానికీ చాక్లెట్ ఫ్లేవర్‌ను తగిలించేంతగా మనకు దగ్గరైపోయిందది. అయితే పాశ్చాత్యుల ప్రభావంతో చాక్లెట్ మన దేశానికి కాస్త ఆలస్యంగానే పరిచయ మైంది గానీ, దీని వెనుక దాదాపు నాలుగువేల ఏళ్ల చరిత్ర ఉంది. మాయన్లు, అజ్‌టెక్‌లు చాక్లెట్‌ను పానీయంగా తీసుకునేవారు. ఇప్పుడైతే చాక్లెట్‌ను తీపిగా తప్ప మరో రుచిలో ఊహించలేం గానీ, వాళ్లంతా చేదుగానే చాక్లెట్‌ను ఆస్వాదించేవారు. కోకో గింజలకు తేనె, వెనిల్లా, నీరు చేర్చి ఒకలాంటి పానీయాన్ని తయారు చేసుకునేవారు.
కోకో గింజలను అజ్‌టెక్‌లు దేవతల ఆహారంగా భావించే వారు. ఆ గింజలనే కరెన్సీగా ఉపయోగించేవారు. మెక్సికన్ల నుంచి కోకో గింజలు పదహారో శతాబ్దంలో స్పెయిన్‌కు పరిచయ మయ్యాయి. శతాబ్దం తర్వాత స్పెయిన్ రాచ కుటుంబానికి, ఫ్రెంచి రాచ కుటుంబానికి వియ్యం ఏర్పడటంతో అచిరకాలంలోనే చాక్లెట్ రుచి యూరోప్ అంతటా విస్తరించింది. డచ్ కెమిస్ట్ కోవెన్‌రాడ్ జొహాన్నెస్ వాన్ హూటెన్ 1828లో కోకో ప్రెస్ యంత్రాన్ని రూపొం దించడంతో, తీపి తీపి మోడర్న్ చాక్లెట్ తయారీకి మార్గం ఏర్పడింది. బ్రిటిష్ కంపెనీ జె.ఎస్.ఫ్రై అండ్ సన్స్ తొలిసారిగా 1847లో చాక్లెట్ బార్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.