Chris Broad
-
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్‌టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం కన్న ఈ మ్యాచ్‌కు ఉపయెగించిన పిచ్ ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. ఈ పిచ్‌పై పేసర్లు పండగ చేసుకున్నారు. ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్‌పై ఇరు జట్ల కెప్టెన్లు డీన్ ఎల్గర్, రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీసీ సీరియస్.. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందని ఐసీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ను మందలిస్తూ న్యూలాండ్స్ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ నివేదిక ప్రకారం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. "న్యూలాండ్స్‌లోని పిచ్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి భయంకరంగా బౌన్స్ అయింది. షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది. బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్ పేర్కొన్నారు. చదవండి: ENG vs IND: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!? -
బ్రాడ్‌కు జరిమానా విధించిన తండ్రి
లండన్ : ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవలె పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్రాడ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో... మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కుమారుడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. జరిమానాతోనే సరిపెట్టకుండా ఒక డీ మెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో వేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో తన బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌కు వెళుతున్న యాసిర్ షాను ఉద్దేశించి బ్రాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం... బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై దూషణకు దిగడం, ఎగతాళి చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు. -
డ్రెస్సింగ్ రూమ్ విధ్వంసం.. కారకుడు అతనే!
సాక్షి, స్పోర్ట్స్ : నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫెరీ క్రిస్ బ్రాడ్.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఆయన ఎటువంటి దాడి జరగలేదని నిర్ధారించారు. అందులో షకీబ్ తలుపును బలవంతంగా నెట్టడంతో గదికి ఉన్న అద్దాలు పగిలిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఈ మేరకు క్రిస్ బ్రాడ్ నివేదికను సిద్ధం చేసినట్లు శ్రీలంక న్యూస్ పేపర్ ది ఐలాండ్ కథనం వెలువరించింది. అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్ బ్రాడ్ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది. ఘటనలో షకీబ్‌పై చర్యలు తీసుకునే అంశంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షకీబ్‌తో పాటు మరో ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. -
ఆ వ్యాఖ్యలు మరీ ఘాటుగా ఉన్నాయి
పుణే పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ స్పందన ముంబై: ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టు పిచ్ నాసిరకంగా ఉందన్న మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ వ్యాఖ్యలతో బీసీసీఐ పూర్తిగా విభేదించింది. ఆయన వ్యాఖ్యలు మరీ కఠినంగా ఉన్నాయని ఐసీసీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 12 వికెట్లతో చెలరేగిన ఆ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిఫరీ బ్రాడ్ ఈ పిచ్ నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. దీన్ని ఐసీసీ... బీసీసీఐకి పంపుతూ రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని కోరింది. దీంతో నూతన పరిపాలనా కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుని శుక్రవారం ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘అది నాసిరకం పిచ్ కాదు. ఆసీస్ అక్కడ రెండు ఇన్నింగ్స్‌లో 260, 285 పరుగులు చేసింది. పూర్ పిచ్ అంటే అనూహ్యంగా బంతి బౌన్స్ కావడం, బ్యాట్స్‌మెన్ గాయాలపాలు కావడం. మరి పుణేలో ఇలా జరిగిందా? మ్యాచ్ త్వరగా ముగిసిన విషయం వాస్తవమే. భారత్ తక్కువ పరుగులే చేసినా ప్రత్యర్థి కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ చేశాడు. రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. అందుకే పిచ్‌పై బ్రాడ్ పరిశీలనతో మేం ఏకీభవించడం లేదు. ఆయన అలా వ్యాఖ్య చేయడం మరీ కఠినంగా ఉంది’ అని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. భారత్‌లోని పిచ్‌లపైనే ఇటీవలి కాలంలో ఐసీసీ ఎక్కువగా దృష్టి పెడుతోందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2015, డిసెంబర్లో నాగ్‌పూర్ పిచ్‌పై కూడా రిఫరీ జెఫ్ క్రో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, బంతి విపరీతంగా టర్న్ అయితే ఆ పిచ్ మంచిది కాదని చెప్పడం సరికాదని ఆ అధికారి అన్నారు. తాజాగా బీసీసీఐ ఇచ్చిన స్పందనపై ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్, ఐసీసీ చీఫ్ రిఫరీ రంజన్ మదుగలే సమీక్ష చేసి తీర్పునివ్వనున్నారు.