ఆ వ్యాఖ్యలు మరీ ఘాటుగా ఉన్నాయి
పుణే పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ స్పందన
ముంబై: ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టు పిచ్ నాసిరకంగా ఉందన్న మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ వ్యాఖ్యలతో బీసీసీఐ పూర్తిగా విభేదించింది. ఆయన వ్యాఖ్యలు మరీ కఠినంగా ఉన్నాయని ఐసీసీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 12 వికెట్లతో చెలరేగిన ఆ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిఫరీ బ్రాడ్ ఈ పిచ్ నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. దీన్ని ఐసీసీ... బీసీసీఐకి పంపుతూ రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని కోరింది. దీంతో నూతన పరిపాలనా కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుని శుక్రవారం ఘాటుగా సమాధానం ఇచ్చింది.
‘అది నాసిరకం పిచ్ కాదు. ఆసీస్ అక్కడ రెండు ఇన్నింగ్స్‌లో 260, 285 పరుగులు చేసింది. పూర్ పిచ్ అంటే అనూహ్యంగా బంతి బౌన్స్ కావడం, బ్యాట్స్‌మెన్ గాయాలపాలు కావడం. మరి పుణేలో ఇలా జరిగిందా? మ్యాచ్ త్వరగా ముగిసిన విషయం వాస్తవమే. భారత్ తక్కువ పరుగులే చేసినా ప్రత్యర్థి కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ చేశాడు. రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. అందుకే పిచ్‌పై బ్రాడ్ పరిశీలనతో మేం ఏకీభవించడం లేదు. ఆయన అలా వ్యాఖ్య చేయడం మరీ కఠినంగా ఉంది’ అని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు.
భారత్‌లోని పిచ్‌లపైనే ఇటీవలి కాలంలో ఐసీసీ ఎక్కువగా దృష్టి పెడుతోందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2015, డిసెంబర్‌లో నాగ్‌పూర్ పిచ్‌పై కూడా రిఫరీ జెఫ్ క్రో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, బంతి విపరీతంగా టర్న్ అయితే ఆ పిచ్ మంచిది కాదని చెప్పడం సరికాదని ఆ అధికారి అన్నారు. తాజాగా బీసీసీఐ ఇచ్చిన స్పందనపై ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్, ఐసీసీ చీఫ్ రిఫరీ రంజన్ మదుగలే సమీక్ష చేసి తీర్పునివ్వనున్నారు.