నిందితులకు శిక్ష రద్దు
చుండూరు దళితుల హత్య కేసులో...
చుండూరు దళితుల ఊచకోత కేసులో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన 8 మంది దళితుల హత్య కేసులో ప్రత్యేక కోర్టు 21 మందికి విధించిన యావజ్జీవ శిక్షను, మరో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్ష, జరిమానాను రద్దు చేసింది. సాక్ష్యాల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేక కోర్టు వాటిని పట్టించుకోకుండా నిందితులకు జైలుశిక్ష విధించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇతర కేసుల్లో అవసరమైతే తప్ప, ఈ 56 మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వీరి నుంచి ఏమైనా జరిమానా మొత్తాలు వసూలు చేసి ఉంటే వాటిని తిరిగివ్వాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు ఎల్.నర్సింహారెడ్డి, ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో చుండూరు, మోదుకూరు గ్రామాల్లో ఎటువంటి సంబరాలు, నిరసనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ గ్రామాలపై మూడు నెలల పాటు నిఘా ఉంచాలని గుంటూరు గ్రామీణ ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు..
చుండూరు దళితుల ఊచకోతపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్ 2007, జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించేంత అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి కాదంటూ మొత్తం 179 మంది నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మిగిలిన వారిలో 21 మందికి యావజ్జీవం, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు. అరుుతే ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. అదే విధంగా శిక్ష పడిన వారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు కొందరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లలో.. తమ శిక్షను రద్దు చేయాలంటూ శిక్ష పడినవారు దాఖలు చేసుకున్న అప్పీళ్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తీర్పులో ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. మృతులు కచ్చితంగా ఏ సమయంలో మృతి చెందారు? ఎక్కడ మృతి చెందారు? దాడి చేసిన వారిని గుర్తించడం తదితర అంశాలకు సంబంధించి తగిన ఆధారాలను కోర్టు ముందుంచడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ప్రాసిక్యూషన్ వైపు నుంచి పలు లోపాలు ఉన్నాయని స్వయంగా ప్రత్యేక కోర్టే స్పష్టంగా పేర్కొందని గుర్తు చేసింది.
ఎవరూ ఫిర్యాదే చేయలేదు..
1991 ఆగస్టు 6న 8 మంది హరిజనులు హత్యకు గురైతే సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎవరూ ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం తెలిపింది. ‘గ్రామంలో భారీ బందోబస్తు ఉన్న సమయంలోనే ఈ హత్యలు, దాడులు చోటు చేసుకోగా.. ఈ హత్యల గురించి పోలీసులకు సమాచారం అందకపోవడం ఊహకందని విషయం. మొదటి రెండు మృతదేహాలను తుంగభద్ర కాలువ వద్ద 9వ సాక్షి గుర్తించేంత వరకు హత్య గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఆగస్టు 7వ తేదీన కూడా మృతుల కుటుంబీకులు తమ సంబంధీకులు కనిపించడం లేదంటూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సమాచారం అరుునా ఇవ్వలేదు. ఈ కేసులో 8, 15వ సాక్షులుగా ఉన్న వ్యక్తులు కూడా అప్పటి ఘటనలో గాయపడ్డారు. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారంతట వారుగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వాంగ్మూలాలను నమోదు చేసే సమయంలో కూడా 8 మంది హత్య గురించి వారు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తి హరిజన వర్గానికి నాయకుడు. తమపై జరిగిన దాడులకు సంబంధించి ఆయన కూడా ఎటువంటి సమాచారం గానీ, ఫిర్యాదు గానీ ఇవ్వలేదు..’ అని పేర్కొంది. ఈ హత్యలకు సంబంధించి సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్లు జారీ చేసినట్లు తెలిపింది.
సాక్ష్యాల మధ్య వైరుధ్యాలు..
సాక్ష్యాల మధ్య అనేక వైరుధ్యాలను ఎత్తిచూపిన ధర్మాసనం.. 15వ సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘15వ సాక్షి తమను వెంబడించి, దాడులకు పాల్పడిన వారు 100 నుంచి 120 మంది ఉంటారంటూ వారి పేర్లు చెప్పారు. అదే వ్యక్తి తమ వర్గానికి చెందిన, తనకన్నా ముందువెళ్లిన వారి పేర్లు తనకు తెలియవని స్వయంగా అంగీకరించారు. అగ్రవర్ణాల దాడుల్లో తనకు తీవ్ర గాయాలయ్యాయని, అయినా కూడా కాలువలో నీటి ప్రవాహానికి ఎదురుగా మూడు కిలోమీటర్ల మేర ఈదానని చెప్పారు. ఇది ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారానికి ఎంత విశ్వసనీయత ఉందో చెబుతోంది.’ అని ధర్మాసనం పేర్కొంది. ‘దాడిపై ఫిర్యాదు చేయని హరిజన వర్గ నాయకుడు తనకు ఈత రాదని అంగీకరించారు. అదే సమయంలో 150 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు ఉన్న కాలువను దాటానని చెప్పారు. తెనాలిలో ఉన్న బంధువుల ఇంట్లో 10.8.1991 వరకు ఆశ్రయం పొందినట్లు అదే ప్రధాన సాక్షి సాక్ష్యమిచ్చారు. పోలీసులు అదే వ్యక్తిని 7.8.1991న జరిగిన మొదటి, రెండవ మృతుల శవ పంచాయతీ సమయంలో సాక్షిగా పేర్కొన్నారు. హత్యలు జరిగినట్లు చెబుతున్న ప్రదేశాలకు, మృతదేహాలు దొరికిన ప్రదేశాలకు సంబంధించిన సాక్ష్యాల మధ్య ఎటువంటి పొంతన లేదు. 131వ నిందితునిగా ఉన్న వ్యక్తి హత్యాకాండ ఘటనలో పాల్గొన్నట్లు సాక్షులు చెప్పారు. వాస్తవానికి ఆ వ్యక్తి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో విధి నిర్వహణలో ఉన్నట్లు ప్రత్యేక కోర్టు తేల్చింది. సాక్షుల సాక్ష్యాల్లో ఉన్న తేడాలను ఇది స్పష్టం చేస్తోంది. మొదటి మృతునిపై ఎ1, ఎ6, ఎ11, ఎ20లు దాడి చేశారని ప్రధాన సాక్షి చెబితే, అదే మృతునిపై ఎ1, ఎ2, ఎ6, ఎ11, ఎ20, ఎ26 దాడి చేశారని నాల్గవ సాక్షి చెప్పారు. ఎ2, ఎ6, ఎ11, ఎ26 మాత్రమే దాడి చేశారని ఏడవ సాక్షి చెప్పారు..’ అంటూ ధర్మాసనం వివరించింది. మొదటి మృతుని హత్యకు ఎ6, ఎ20 కారకులని తేల్చిన ప్రత్యేక కోర్టు, అందుకు ఆధారాలు ఏమిటో చెప్పలేదంది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మోపిన అభియోగాలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. వాటిని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తేల్చి చెప్పింది.
ఇప్పటికైనా వైషమ్యాలను మరిచిపోండి...
‘ఈ వైషమ్యాల వల్ల 8 విలువైన ప్రాణాలు పోయాయి. మృతుల కుటుంబాలు శిథిలమైపోయాయి. దశాబ్దాలుగా నెలకొని ఉన్న వైషమ్యాలను ఇప్పటికైనా మరిచిపోవాలి. ఇందుకు ఇరుపక్షాల పెద్దలు చొరవ తీసుకోవాలి..’ అని ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.
వికలాంగుడెలా తరమగలడు?
‘‘ఈ కేసులో 6వ నిందితునిగా ఉన్న వ్యక్తి శారీక వికలాంగుడు. తన మోకాలిపై చేయి వేయకుండా అతను కనీసం నడవలేడని ఈ ఘటనకు ప్రధాన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే వికలాంగుడైన ఆ వ్యక్తి ఇతర నిందితులతో కలసి తమను తరిమినట్టు అదే ప్రధాన ప్రత్యక్ష సాక్షులు ప్రత్యేక కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చారు. శారీరక వికలాంగుడు ఎలా తరమగలడన్న విషయాన్ని కిందికోర్టు కనీస స్థాయిలో ఆలోచించకుండా ప్రధాన సాక్షుల సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంది..’’ అంటూ హైకోర్టు ధర్మాసనం సాక్ష్యాల మధ్య వైరుధ్యాలను వివరించింది.
సుప్రీంకోర్టుకు వెళతాం..
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రరుుంచనున్నట్టు గుంటూరు రూరల్ ఎస్పీ జెక్కంశెట్టి సత్యనారాయణ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత వాటిని పరిశీలించి సుప్రీంలో అప్పీల్ దాఖలు చేస్తామని చెప్పారు. చుండూరు మారణకాండలో 21మంది జీవిత ఖైదీలకు హైకోర్టు విముక్తి కలిగించడంపై సుప్రీంకోర్టుకు వెళతామని రాష్ట్ర దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు పొన్నూరులో చెప్పారు. నిందితులకు శిక్షపడే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా తన బాధ్యతగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయూలని కోరారు.
గ్రామాల్లో పోలీస్ పికెట్లు
చుండూరు ఊచకోత కేసును హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చుండూరు, అంబేద్కర్ నగర్, మున్నంగివారిపాలెం, మోదుకూరులో అదనపు బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశారు. తెనాలి డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మంగళవారం చుండూరును సంద ర్శించి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.
మంగళవారంతో ముడిపడ్డ కేసు
చుండూరు దళితుల ఊచకోత జరిగిన 1991 ఆగస్టు 6 మంగళవారం. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది కూడా 2007, జూలై 31 మంగళవారం నాడే. దీనిపై దాఖలైన అనేక అప్పీళ్ల నేపథ్యంలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మంగళవారం నాడే హైకోర్టు వీటి విచారణ చేపట్టింది. కాగా మంగళవారం నాడే నిందితులకు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించడం విశేషం.