circuit
-
647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్ల సవరణ
వారాంతం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) 647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్లను సవరించింది. ట్రేడింగ్‌పై నిఘా సమీక్షలో భాగంగా పలు కౌంటర్ల సర్క్యూట్ బ్రేకర్లలో మార్పులు చేసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. అయితే ట్రేడ్ టు ట్రేడ్(టీ2టీ) విభాగంలోకి వచ్చిన కౌంటర్లకు యధాప్రకారం 5 శాతం సర్క్యూట్ ఫిల్టర్ అమలవుతుందని తెలియజేసింది. కొన్ని కౌంటర్లను టీ2టీ విభాగం నుంచి తొలగించడంతోపాటు సర్క్యూట్ బ్రేకర్‌ను 20 శాతానికి పెంచింది. ఇదే విధంగా మరికొన్ని కౌంటర్ల ఫిల్టర్లను 10 శాతం నుంచి 20 శాతానికి మార్పు చేసింది. మరికొన్ని కౌంటర్లను టీ2టీ విభాగంలో చేర్చింది. వివరాలు చూద్దాం.. ఇదీ జాబితా బీఎస్ఈ తాజాగా 36 స్టాకులను 5 శాతం నుంచి 20 శాతం ప్రైస్ బ్యాండ్‌లోకి మార్పు చేసింది. ఈ జాబితాలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డెల్టా కార్ప్, సెంట్రమ్ క్యాపిటల్, ఎవరెడీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఫ్యూచర్ రిటైల్, వాటెక్ వాబాగ్ చేరాయి. ఇదే విధంగా 10 శాతం నుంచి 20 శాతానికి చేరిన కౌంటర్లలో డీమార్ట్, నెల్కో, ఆవాస్ ఆవాస్ ఫైనాన్షియర్స్, స్పైస్‌జెట్, అరవింద్, అతుల్ ఆటో, బీడీఎల్, ట్రైడెంట్, షాపర్స్ స్టాప్, షాలిమార్ పెయింట్స్, హిమత్సింగ్కా సీడ్, హింద్ అల్యూమినియం, ఐఎఫ్సీఐ, ఇగార్షీ మోటార్స్, ఇండియన్ టెరైన్, ఇండియన్ టోనర్స్, ఆదిత్య బిర్లా మనీ, ఏషియన్ గ్రానైటో తదితరాలున్నాయి. ఇక 5 శాతం నుంచి 10 శాతం ఫిల్టర్‌కు 325 కౌంటర్లు చేరాయి. వీటిలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, బజాజ్ హిందుస్తాన్, బీఎఫ్ యుటిలిటీస్, గ్రాఫైట్, జీవీకే పవర్, ఐడీబీఐ బ్యాంక్, ఐబీ రియల్టీ, ఐనాక్స్ విండ్, లెమన్ ట్రీ హోటల్స్‌కు చోటు లభించింది. 10 శాతం నుంచి 5 శాతానికి దిగిన జాబితాలో గొదావరి పవర్, ఆన్‌మొబైల్ గ్లోబల్, నియోజెన్ కెమికల్స్ తదితర 6 షేర్లు చేరాయి. ఈ సవరణలన్నీ ఆగస్ట్ 7(శుక్రవారం) నుంచీ అమల్లోకి వచ్చినట్లు బీఎస్ఈ తెలియజేసింది. 1987లో.. షేర్ల ధరల అనూహ్య పతనం లేదా ర్యాలీని నివారించేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సర్క్యూట్ బ్రేకర్లను అమలు చేస్తుంటాయి. ఈ విధానానికి 1987లో బీజం పడింది. 1987 అక్టోబర్ 19న యూఎస్ ఇండెక్స్ డోజోన్స్ ఒక్క రోజులోనే దాదాపు 23 శాతం కుప్పకూలింది. దీంతో సర్క్యూట్ బ్రేకర్ల అంశం తెరమీదకు వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా 2001 జులై 2న ఇండెక్స్ ఆధారిత సర్క్యూట్ బ్రేకర్లు ప్రారంభమయ్యాయి. తదుపరి పలు మార్పులకు లోనైన విషయం విదితమే. ఇండెక్సుల విషయంలో ప్రస్తుతం 10 శాతం, 15 శాతం, 20 శాతంగా ఫిల్టర్లు అమలవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
విద్యుత్ తీగలు తాకి టిప్పర్ దగ్ధం
ఉట్లపల్లి(పెద్దవూర) విద్యుత్ తీగలు తాకడంతో టిప్పర్ దగ్ధమైంది. ఈ ఘటన గురువారం మండలంలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి గేమ్యానాయక్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అనుముల మండలం యాచారం నుంచి ఊట్లపల్లి పుష్కరఘాట్‌కు టిప్పర్ కంకరను అన్లోడ్ చేసి వస్తుండగా తండా సమీపంలోకి రాగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తాకాయి. దీంతో టిప్పర్ షార్స్ర్క్యూట్కు గురై మంటలు వ్యాపించాయి. టిప్పర్ డ్రైవర్ చాకచక్యంతో కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. టిప్పర్ మంటలతో కూడిన పొగలు వ్యాపించటంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, తండావాసులు గమనించి సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. టిప్పర్ టైర్లు మంటలలో కాలిపోతూ పెద్ద శబ్దంతో పేలి పోయాయి. మంటలు డీజిల్ ట్యాంక్‌కు అంటుకుని పేలిపోతుందనే భయంతో టిప్పర్ దగ్గరకు వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. హాలియా ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయటంతో ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పేదాకా ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఆత్మకూరు(ఎం): విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయిపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బచ్చె అయిలయ్య (35) తన మామ వ్యవసాయబావి వద్ద పంపుసెట్ మోటారు సక్రమంగా నడవకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బంద్‌చేయడానికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ పట్టుకుని ఆఫ్ చేస్తుండగా విద్యుత్‌ప్రసరణ జరిగి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు గుర్తించి గాయపడిన అయిలయ్యను చికిత్స నిమిత్తం మోత్కూర్‌కు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి సోదరుడు బచ్చె నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలం వద్ద సందర్శించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శివనాగప్రసాద్ తెలిపారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన బచ్చె అయిలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీ, సర్పంచ్ బొట్టు మల్లమ్మ కోరారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ బచ్చె అయిలయ్య మృతికి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చెప్పారు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.