Civil Rights Day
-
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలి
ములుగు రూరల్ వరంగల్ : సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని ఇంచర్ల గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూ చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ కోరగా.. పంపిణీకి ప్రభుత్వ భూమి లేదని, అమ్మేవారు ఉంటే తహసీల్దార్ దృష్టిఇ తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి చందూలాల్‌తో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీసీరోడ్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని ఎంపీడీఓ విజయ్ స్వరూప్‌ను ఆదేశించారు. తన కూతురు కళ్యాణలక్ష్మీ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పరిశీలించి పథకం వర్తింపజేయాలని తహసీల్దార్‌ను ఆవేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రవికిరణ్, ఎస్సై బండారి రాజు, జెడ్పీటీసీ సకినాల శోభన్, సర్పంచ్ ముడతనపల్లి కవితకుమార్, ఎంపీటీసీ సభ్యుడు శానబోయిన అశోక్, ఆర్ఐ అఫ్రీన్, యుగంధర్‌రెడ్డి, వీఆర్వో సూరయ్య పాల్గొన్నారు. -
ఎస్సీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ తెలిపారు. శుక్రవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెడ్డీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పౌరహక్కుల దినాన్ని నిర్వహించాలి కడప అర్బన్ : జిల్లాలో ప్రతి నెల 30న జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పౌర హక్కుల దినాన్ని నిర్వహించుకోవాలనే చట్టం ఉందని, తద్వారా పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించుకోవడానికి వీలవుతుందని కమలమ్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సభా భవనంలో రాయలసీమ ఎస్సీ, ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు జేవీ రమణ, అంబేడ్కర్ మిషన్ కడప అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్‌కుమార్, దళిత నాయకుడు డి.జయచంద్ర, అమీన్పీరా, సైమన్, ఎల్వీ రమణ, జకరయ్య, సంగటి మనోహర్, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర సభ్యులు జయచంద్ర, ఎస్సీ సంఘం సభ్యులు శిరోమణెమ్మ, కుమారి, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేటికీ వివక్ష..
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్: స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొట్టిపాడు పంచాయతీ పరిధి మిట్టపాలెంలో ఉన్న రెండు మంచినీటి చెరువుల్లో ఒకటి గ్రామంలో మరొకటి ఎస్సీ కాలనీలో ఉండటం ప్రత్యేకం. ఈవూరివారిపాలెం గ్రామంలోని ఎస్టీలకు ఇదే విధానం అమలు చేస్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించే అవకాశం లేదు. ఎన్నికల సమయంలో వారి ఓట్లను గ్రామస్తులే వినియోగించుకున్న సంఘటనలు వున్నాయి. గోవిందపురం గ్రామం సర్వే నంబర్ 563లో ఎస్సీలకు నివేశన స్థలాలు, శ్మశాన స్థలాలను కేటాయించారు. అయితే వాటిని రద్దు చేసి గ్రానైట్ క్వారీలకు లీజుకు ఇచ్చారు. ఇదే తరహాలో యడవల్లి గ్రామం సర్వే నంబర్ 381లో అసైన్డ్ భూమిని ఎస్సీలకు కేటాయించి విడతల వారీగా రద్దు చేసి ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తున్నారు. కావూరు గ్రామం సర్వే నంబర్ 164లో సాగు భూమిని దశాబ్దాల క్రితమే ఎస్సీలకు కేటాయించారు. పూర్వీకులు మరణిస్తే వారి వారసులకు నేటికీ పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు చేయలేదు. ఇలా అన్నింటా వివక్ష కొనసాగుతూనే వుంది. చైతన్య కార్యక్రమాల ఊసేలేదు ... ప్రతి నెల చివరి రోజైన 30,31 తేదీల్లో మండలంలోని ఏదైనా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారులతో పౌరహక్కుల దినోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజలు పాల్గొని వారి సమస్యలను తెలియజేస్తుంటారు. సంవత్సర కాలం నుంచి ఈ కార్యక్రమాల ఊసే లేదని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇక నుంచి గ్రామాల్లో నిర్వహిస్తాం సమైక్యాంధ్ర సమ్మె ప్రభావంతో గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించలేదు. అనంత రం వివిధ సమావేశాలతో సమయం లేకపోవటంతో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. జనవరి నెల నుంచి క్రమం తప్పకుండా ప్రతినెలా గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తాం.- జీవీఎస్.ఫణీంద్రబాబు, తహశీల్దార్, చిలకలూరిపేట