చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్: స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొట్టిపాడు పంచాయతీ పరిధి మిట్టపాలెంలో ఉన్న రెండు మంచినీటి చెరువుల్లో ఒకటి గ్రామంలో మరొకటి ఎస్సీ కాలనీలో ఉండటం ప్రత్యేకం. ఈవూరివారిపాలెం గ్రామంలోని ఎస్టీలకు ఇదే విధానం అమలు చేస్తున్నారు.
అలాగే స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించే అవకాశం లేదు. ఎన్నికల సమయంలో వారి ఓట్లను గ్రామస్తులే వినియోగించుకున్న సంఘటనలు వున్నాయి. గోవిందపురం గ్రామం సర్వే నంబర్ 563లో ఎస్సీలకు నివేశన స్థలాలు, శ్మశాన స్థలాలను కేటాయించారు. అయితే వాటిని రద్దు చేసి గ్రానైట్ క్వారీలకు లీజుకు ఇచ్చారు. ఇదే తరహాలో యడవల్లి గ్రామం సర్వే నంబర్ 381లో అసైన్డ్ భూమిని ఎస్సీలకు కేటాయించి విడతల వారీగా రద్దు చేసి ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తున్నారు. కావూరు గ్రామం సర్వే నంబర్ 164లో సాగు భూమిని దశాబ్దాల క్రితమే ఎస్సీలకు కేటాయించారు. పూర్వీకులు మరణిస్తే వారి వారసులకు నేటికీ పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు చేయలేదు. ఇలా అన్నింటా వివక్ష కొనసాగుతూనే వుంది.
చైతన్య కార్యక్రమాల ఊసేలేదు ...
ప్రతి నెల చివరి రోజైన 30,31 తేదీల్లో మండలంలోని ఏదైనా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారులతో పౌరహక్కుల దినోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజలు పాల్గొని వారి సమస్యలను తెలియజేస్తుంటారు. సంవత్సర కాలం నుంచి ఈ కార్యక్రమాల ఊసే లేదని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఇక నుంచి గ్రామాల్లో నిర్వహిస్తాం
సమైక్యాంధ్ర సమ్మె ప్రభావంతో గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించలేదు. అనంత రం వివిధ సమావేశాలతో సమయం లేకపోవటంతో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. జనవరి నెల నుంచి క్రమం తప్పకుండా ప్రతినెలా గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తాం.- జీవీఎస్.ఫణీంద్రబాబు, తహశీల్దార్, చిలకలూరిపేట
నేటికీ వివక్ష..
Published Fri, Jan 10 2014 12:33 AM | Last Updated on Sat, Sep 15 2018 3:18 PM
Advertisement