గుకేశ్ ఎనిమిదో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఎనిమిదో ‘డ్రా’ నమోదు చేశారు. ఫలితంగా ఈ ఇద్దరికి విజేతగా నిలిచే అవకాశాలకు తెరపడింది. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ గుకేశ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిదో రౌండ్ తర్వాత మాక్సిమి లాచెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), గుకేశ్, వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద 4 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గుకేశ్ ఐదో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరూజా 5.5 పాయింట్లతో మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా అవతరించాడు. 4.5 పాయింట్లతో కరువానా రెండో స్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో వెస్లీ సోతో గుకేశ్; నొదిర్‌బెక్‌తో నిపోమ్‌నిషి (రష్యా); కరువానాతో అనీశ్ గిరి; ఫిరూజాతో ప్రజ్ఞానంద; మాక్సిమితో డింగ్ లిరెన్ తలపడతారు.