పందుల సంచారంపై నిషేధం
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో పందుల సంచారంపై నిషేధం విధిస్తున్నట్లు మేయర్ రవీందర్‌సింగ్ ప్రకటించారు. గురువారం 4వ డివిజన్లోని అరుంధతీనగర్, వినాయకకాలనీల్లో కార్పొరేటర్ ఎడ్ల సరితఅశోక్‌తో కలిసి సైకిల్‌పై పర్యటించారు. శానిటేషన్ పనులు తనిఖీ చేశారు. పందుల బెడద తొలగించాలని స్థానిక మహిళలు మొరపెట్టుకున్నారు.
ఇటీవల చిన్న పిల్లలపై పందులు దాడిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. స్పందించిన మేయర్ పై విధంగా నిర్ణయం తీసుకున్నారు. పెంపకందారులు తమ పందులను వెంటనే తరలించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే శానిటేషన్ కార్మికులకు రూ.వెయ్యి నగదు బహుమతిని మేయర్ ప్రకటించారు. గృహిణులు తమ ఇళ్లలో వెలువడే చెత్తను డ్రెయినేజీల్లో వేయెుద్దని విన్నవించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ను మందలించారు. ఇక నుంచి ప్రతి డివిజన్లో కార్మికుల పనితీరు నివేదిక అందించాలని సూచించారు. రెవెన్యూ అధికారి రాములు తదితరులు మేయర్ వెంట ఉన్నారు.