climate change agreement
-
పర్యావరణ ప్యాకేజీ... 300 బిలియన్ డాలర్లు
బకూ (అజర్బైజాన్): వాతావరణ మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు వీలుగా వర్ధమాన దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేందుకు ధనిక దేశాలు అంగీకరించాయి. అజర్బైజాన్లోని బకూ వేదికగా జరుగుతున్న కాప్–29 సదస్సులో ఆదివారం ఈ మేరకు పర్యావరణ ప్యాకేజీపై ఒప్పందం కుదిరింది. వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు ఇచ్చేలా 2009లో కాప్ సదస్సులో అంగీకారం కుదరడం తెలిసిందే. దాని స్థానంలో 2035 నాటికి ఆ దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేలా ప్యాకేజీని సవరించారు. కానీ పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ చాలదని భారత్ మండిపడింది. పలు వర్ధమాన దేశాలు కూడా అందుకు గొంతు కలిపాయి. పర్యావరణ పరిరక్షణ చర్చల విషయంలో కాప్–29 ప్రెసిడెన్సీ వ్యవహార శైలి సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పారిస్ ఒప్పంద లక్ష్యాలకు విఘాతం కలిగిస్తూ ధనిక దేశాలు తమ బలాన్ని ఉపయోగించి తమపై బలవంతంగా ఈ ఒప్పందాన్ని రుద్దుతున్నాయమని మండిపడ్డాయి. ఈ ప్యాకేజీని ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’గా ఆఫ్రికన్ గ్రూప్ ప్రతినిధులు అభివర్ణించారు. గత శుక్రవారం దాకా జరగాల్సిన 12 రోజుల కాప్ సదస్సు రెండో రోజులు అదనంగా కొనసాగి దేశాల అభ్యంతరాలు, వాకౌట్ల నడుమ ఆదివారం ముగిసింది.అంగీకరించబోం: భారత్ వాతావరణ మార్పుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే బాగా ప్రభావితమవుతున్నాయని భారత్ గుర్తు చేసింది. ‘‘వాటికి కేవలం 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ చాలా తక్కువ. ఇందుకు అంగీకరించబోం’’ అని స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను తీసుకోకుండా కాప్–29 అధ్యక్షునితో పాటు ఐరాస ఈ ఒప్పందాన్ని దేశాలపై రుద్దాయని ఆరోపించింది. దీన్ని తీవ్ర అన్యాయంగా సదస్సులో పాల్గొన్న భారత్ ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు చాందినీ రైనా అభివరి్ణంచారు. ప్యాకేజీని ఆమోదించే ముందు కనీసం తమతో మాట్లాడాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘‘అన్నిదేశాల అభ్యంతరాలనూ వినాలి. ఇలా దేశాలను మాట్లాడనీయకుండా చేయడం ఐరాస వాతావరణ మార్పుల ఒప్పందానికి విరుద్ధం. దీన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది’’ అని తెలిపారు.పెద్ద జోక్: నైజీరియా భారత్కు నైజీరియా మద్దతు తెలిపింది. 300 బిలియన్ డాలర్లు ప్యాకేజీ పెద్ద జోక్ అని వ్యాఖ్యానించింది. మలావీ, బొలీవియా సైతం భారత్తో గొంతు కలిపాయి. ఇది నిరాశాజనక పరిణామమని ‘తక్కువ అభివృద్ధి చెందిన దేశాల’ (ఎల్డీసీ) గ్రూప్ చైర్మన్ ఎవాన్స్ ఎన్జేవా అన్నారు. ఒప్పందం ఏకపక్షంగా జరిగిందని ఆఫ్రికన్ గ్రూప్ ఆఫ్ నెగోషియేటర్స్ (ఏజీఎన్) చైర్మన్ విమర్శించారు. ఇది హాస్యాస్పదమని నైజీరియాకు చెందిన సంధానకర్త ఎన్కిరుకా మదుక్వే అన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలి తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు వర్ధమాన దేశాలకు ఉందని ఆమె అన్నారు. ఎల్డీసీ గ్రూప్, అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ (ఏఓఎస్ఐఎస్) ప్రతినిధులు వాకౌట్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఐరాస వాతావరణ చర్చలు దాదాపు విఫలమయ్యాయని ఐరాస మానవ హక్కుల మాజీ హైకమిషనర్ మేరీ రాబిన్సన్ అన్నారు.1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలి గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కట్టడికి సాయపడేందుకు అల్పాదాయ ఆర్థిక వ్యవస్థలకు సంపన్న దేశాలు ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, మద్దతు అందిస్తున్నాయి. ఇందుకోసం 2020 నాటికి 100 బిలియన్ డాలర్లు అందిస్తామని 2009లో హామీ ఇచ్చినా దాన్ని నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రకటించిన 300 బిలియన్ డాలర్లు ఏ మూలకూ చాలవని, కనీసం 1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణంలో అదో మైలురాయి
బీజింగ్: ‘బొగ్గు అంటే చైనా, చైనా అంటే బొగ్గు’ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2012లో చైనా గురించి చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మొత్తం ప్రపంచంలో సగం బొగ్గును చైనానే ఉత్పత్తి చేసేది. విద్యుత్ ఉత్పత్తి కోసం దాన్ని ఉపయోగించేది. ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక దేశంగా ఘనతికెక్కిన చైనాలో అప్పుడు 2,600 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేవి. 2014 సంవత్సరం నుంచి చైనా వైఖరి ఊహించని విధంగా మారింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గిస్తూ జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ కేంద్రాలను పెంచుతూ వచ్చింది. థర్మల్ విద్యుత్ రంగంలో ఉత్పత్తిని తగ్గిస్తూ కాలుష్యరహిత ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో బ్రిటన్, అమెరికా తర్వాత చైనానే నిలబడింది. 2013లో చైనా 420 టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించగా, 2014లో దానిలో 2.9 శాతాన్ని, 2015లో 3.6 శాతాన్ని చైనా తగ్గించిందని ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’ వెల్లడించింది. అదే సమయంలో చైనా సౌర విద్యుత్ రంగంలో 28 శాతం, పవన, జల విద్యుత్ రంగాల్లో 13 శాతం ఉత్పత్తిని పెంచిందని చైనాకు చెందిన ‘రినీవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ తెలియజేసింది. భూతాపోన్నతిపై అంతర్జాతీయంగా కుదురిని అవగాహన మేరకు 2014 నుంచి బ్రిటన్, అమెరికా, చైనాలతోపాటు జపాన్, కెనడా, జర్మనీ, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాలు కూడా విద్యుత్ కోసం బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. కనుక ఆ సంవత్సరాన్ని ›ప్రపంచ ఆర్థిక, పర్యావరణ చరిత్రలో ఓ మైలురాయిగా పరిగణిచ్చవచ్చని వ్యాసకర్తలు అభివర్ణించారు.