తగ్గిన మూసివేత స్కూళ్ల సంఖ్య !
– 262 నుంచి 185కు కుదింపు
– ముగింపు దశకు రేషనలైజేషన్
– కమిటీ ఆమోదం పొందగానే నేడో రేపో అధికారిక ప్రకటన
అనంతపురం ఎడ్యుకేషన్ : రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రభావంతో జిల్లాలో మూతపడనున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో జారీ చేసిన జీఓ మేరకు జిల్లాలో సుమారు 262 స్కూళ్లు మూతపడే జాబితాలో ఉండేవి. నిబంధనలు సవరిస్తూ ఇటీవల మళ్లీ జీఓ జారీ చేయడంతో మూతపడే స్కూళ్ల సంఖ్య 185కు తగ్గింది. అయితే దీన్ని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా కమిటీ ద్వారా ఆమోదం పొందగానే నేడో, రేపో మూతపడనున్న స్కూళ్ల జాబితాను ప్రకటించనున్నారు.
‘0’ విద్యార్థుల సంఖ్య స్కూళ్లు 108
జిల్లాలో 108 స్కూళ్లు ‘0’ విద్యార్థుల సంఖ్య కారణంగా మూతపడనున్నాయి. ఇందులో సుమారు 40 ప్రాథమిక పాఠశాలలు , 68 ప్రాథమికోన్నత పాఠశాలలు. 20 మందిలోపు విద్యార్థులున్న మరో 25 ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్నారు. అలాగే 20 మందిలోపు విద్యార్థులుండి కిలోమీటరు పరిధిలో పాఠశాల లేకపోతే అలాంటి ప్రాథమిక స్కూళ్లను కొనసాగించనున్నారు. అలాగే 68 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకానున్నాయి. వాస్తవానికి 150 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకావాల్సి ఉంది. గతంలో 6,7 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు, 6,7,8 తరగతుల్లో 40 మంది విద్యార్థులున్న పాఠశాలలకు మంగళం పాడాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూపీ స్కూళ్లు మూతపడుతుండటంతో ఉపాధ్యాయ సంçఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం 6, 7 తరగతుల్లో 20 మందిలోపు విద్యార్థులు, 6, 7, 8 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను ఎత్తివేసేలా జీఓ జారీ చేశారు. దీంతో జిల్లాలో 52 స్కూళ్లు మూతపడే జాబితా నుంచి బయటపడ్డాయి. 3 కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేకపోతే కొనసాగించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలలకు సంబంధించి 50 మందిలోపు విద్యార్థులున్న 4 పాఠశాలలు మూతపడనున్నాయి. 58 సక్సెస్ స్కూళ్లపై హేతుబద్ధీకరణ ప్రభావం పడింది. 50 మందిలోపు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులున్న 58 స్కూళ్లు తెలుగు మీడియం పాఠశాలలకు విలీనం కానున్నాయి. ఆయా స్కూళ్లలో ఎస్ఎంసీ తీర్మానాల ద్వారా మీడియం బదిలీ చేశారు. అయితే వీటిలో నాలుగు స్కూళ్ల నుంచి తీర్మానాలు అందలేదు. ఆ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు కొనసాగించే వీలు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.