ఉచిత నిర్బంధ విద్య ఏమైందని ప్రశ్న
హైదరాబాద్: పేదలకు ఉచితవిద్యను అందకుండా స్కూళ్ల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకుంటామని బీజేపీ శాసనసభ పక్షనాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో 4500 స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల 15వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం ఉంటుందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతీ మండలంలో ఒక రెసిడెన్షియల్‌ను ఏర్పాటుచేసి కేజీ టు పీజీదాకా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఉచిత నిర్బంధ విద్యను అందించకపోగా ఉన్న స్కూళ్లను మూసేయడం దారుణమని లక్ష్మణ్ విమర్శించారు. లంబాడీ తాండాలు, గిరిజన గూడాలు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న పేదలకు విద్యను అందకుండా చేసే కుట్ర దీనిలో దాగి ఉందని విమర్శించారు. ఉచిత నిర్బంధ విద్య, బదిలీలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు రూల్స్ వంటివాటిపై అఖిలపక్ష సమావేశం, శాసనసభాపక్షాలతో సమావేశం నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేవిధంగా రోజుకో కొత్త హామీతో ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని హైదరాబాద్‌లో పేదలకు గృహ నిరాణం గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే కొందరికే పదవులు, అధికారం కాదన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగక ముందే కళ్లు తెరవాలని లక్ష్మణ్ సూచించారు.
స్కూళ్ల మూసివేతను అడ్డుకుంటాం
Published Fri, May 1 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement