ప్రతిపక్షాలంటే ఎందుకంత భయం?
సాక్షి, జగిత్యాల: నేరం నాది కాదు ఆకలిదీ అనే సినిమాలాగా.. ఈ పాపం నాది కాదు కేంద్రానిది అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, ప్రజలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే.. నిర్భందాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వాస్తవాల్ని వక్రీకరించడం, శాశ్వతంగా సభ్యులను సభ నుంచి తొలిగించడం ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు.
స్వామిగౌడ్ని టీఆర్ఎస్ నాయకునిగా ఎవరూ భావించలేదని ఉద్యమకారునిగానే గుర్తించామన్నారు. గవర్నర్ ప్రసంగం వీడియో రికార్డింగ్ ఫుటేజీ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సభలో జరిగిన దాన్ని స్పీకర్, శాసనమండలి చైర్మన్ సుమోటోగా స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ఘటన ఆధారంగా చేసుకుని శాసనసభ్యులను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమని, సంఘటన ఫుటేజీ బయట పెట్టే వరకు చర్యలు తీసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, పార్లమెంట్లో మీకోనీతి అసెంబ్లీలో మాకో నీతా అని ప్రశ్నించారు.