కళా‘విహీన’మందిరం
శిథిలమైన సినారే కళాభవనం
ఏళ్లుగా మరమ్మతుకు నోచని వైనం
ఆవేదన చెందుతున్న కళాకారులు
వేములవాడ రూరల్ : తాను పుట్టినగడ్డపై మమకారంతో సినారె(సి.నారాయణరెడ్డి) నిర్మింపజేసిన సినారే కళామందిరం మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరింది. సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అన్ని హంగులు కల్పించిన భవనం అసౌకర్యాలకు నిలయంగా మారింది. దీనిపై కథనం..
రూ.50లక్షల వ్యయంతో నిర్మాణం
వేములవాడ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 2002 ఏప్రిల్ 10న అప్పటి రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న హన్మాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి కళామందిరం ప్రారంహించారు. తన పేరు చిరకాలంగా కళాకారుల్లో గుర్తిండి పోయేలా ఆయన మందిర నిర్మాణానికి రూ.50లక్షలు వెచ్చించారు. ప్రభుత్వ, కళాకారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు దీనిని అన్ని సౌకర్యాలతో నిర్మించారు.
ధ్వంసమైన అద్దాలు, దర్వాజాలు..
వేములవాడ నియోజకవర్గంగా ఆవిర్భావం నుంచి సినారే కళామందిరం మరమ్మతుపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి సారించడంలేదు. భవనం శిథిలావస్థకు చేరింది. నీటిసౌకర్యంలేక మూత్రశాలలు, మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. భవనం శిథిలం కావడంతో సభలు, సమావేశాలు నిర్వహించడం లేదు. పూర్తినిర్మానుష్యంగా మారడంతో మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. చిత్తుగా మద్యం తాగాక భవనం అద్దాలు, దర్వాజాలు పగులగొట్టారు.
నిధులు గోల్మాల్..?
2002లో సినారె కళాభవం నిర్మించాక సుమారు 14ఏళ్లపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, శుభకార్యాలు, సభల, సమావేశాలు నిర్వహించారు. ఇందుకోసం మండల పరిషత్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకునేవారు. నామమాత్రపు అద్దె చెల్లించేవారు. ఇలా పద్నాలుగేళ్లపాటు సినారె భవనం నిర్వహణ దారులకు అద్దె సొమ్ము దుర్వినియోగమైనట్లు సమాచారం. కార్యాలయంలో పనిచేసే అధికారులు బదిలీలు అయినప్పుడల్లా నిధులు గోల్మాల్ చేసినట్లు తెలిసింది. మండల పరిషత్ పాలకులు అధికారులకు తోడుకావడంతో విద్యుత్ చార్జీలు, రిపేర్ల పేరుతో అడ్డగోలుగా దండుకున్నట్లు సమాచారం.
కళామందిరాన్ని కాపాడుకుందాం
– సోమినేని బాలు, జానపదకళాకారుడు, నూకలమర్రి
ఈప్రాంత కళాకారులకు భవనం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రముఖ రచయిత సినారె ఆయన పేరిట భవనం నిర్మింపజేశారు. దాని నిర్వహణను అధికారులు, పాలకులు పట్టించుకుంటలేరు. మందిరాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది.
పాలకులకు చిత్తశుద్ధిలేదు
– తీగల రాజేశంగౌడ్, ఒగ్గుకళాకారుడు
కళామందిర భవనం శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతు చేయాలనే ధ్యాస పాలకులకు లేదు. కొత్తభవనం నిర్మించడం దేవుడెరుగు కానీ, ఉన్నదాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో లేని పాలకులు.. ఇక ప్రజలకేం చేస్తరు. నాయకులు, అధికారులు దీనిపై శ్రద్ధ చూపాలి.
మరమ్మతు చేయిస్తాం
– వేణుగోపాల్, ఇన్చార్జి ఎంపీడీవో
సినారె కళామందిరం తాత్కాలిక మరమ్మతుకు మండల నిధుల నుంచి మూడు లక్షల రూపాయలు కేటాయించాలని తీర్మానించాం. మరుగుదొడ్లు, మూత్రశాలలకు నీటి సౌకర్యం కల్పిస్తాం. మందిరం అద్దె డెబ్బయివేల వరకు మండల పరిషత్ ఆధీనంలో ఉన్నాయి.