సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్
బొగ్గు బిల్లు; గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపునకు పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్
కాంగ్రెస్, లెఫ్ట్ మినహా ప్రభుత్వానికి సహకరించిన విపక్షం
రెండు బిల్లులపై ఓటింగ్; జేడీయూ వాకౌట్.. వీగిపోయిన విపక్షాల సవరణలు
ముగిసిన బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. ఏప్రిల్ 20న తిరిగి మొదలు
న్యూఢిల్లీ: సంస్కరణల్లో భాగంగా, వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపును చట్టబద్ధం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు కీలక బిల్లులు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందాయి. అనూహ్యంగా, పలు విపక్షాలు మద్దతివ్వడంతో ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదం సులభమైంది. విపక్షాలు.. ముఖ్యంగా బొగ్గు , ఖనిజ నిక్షేపాలున్న రాష్ట్రాల పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరి రోజున ‘గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’, ‘బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) సవరణ బిల్లు’లు ఆమోదం పొందడం విశేషం.
ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన బిల్లులను విపక్షం పట్టుతో రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపించాల్సి వచ్చింది. సమావేశాలు ముగియడానికి రెండు రోజులే ఉండడంతో ఈ బుధవారం ఆ కమిటీలు నివేదికలను సభ ముందుంచా యి. వాటిపై చర్చకు మరింత సమయం కావాలని ప్రధాన విపక్షం డిమాండ్ చేయడంతో వాటి ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఆ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు ఎప్రిల్ 5 తర్వాత రద్దైపోతాయి. అందువల్ల, శుక్రవారం ఆమోదం పొందలేకపోతే మరోసారి ఆర్డినెన్స్‌లను జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది.
గనులు, ఖనిజాల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంతో ఇనుప ఖనిజం సహా ఖనిజ నిక్షేపాల కేటాయింపు ఇక వేలం ద్వారా జరిపేందుకు మార్గం సుగమమైంది. జూన్ నుంచి వీటి వేలం ప్రక్రియ రాష్ట్రాలు ప్రారంభించే అవకాశముంది. తమ రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో అవి బిల్లులకు మద్దతిచ్చాయి. మొత్తమ్మీద ఈ భేటీల్లో ప్రభుత్వం బీమా, బొగ్గు, ఖనిజాల బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందింది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు సాగుతాయి.
బొగ్గు బిల్లు..
వేలం ద్వారా బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించే ‘బొగ్గు గనులు (ప్రత్యేక నిబంధనల) బిల్లు, 2015’పై శుక్రవారం రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. బిల్లుకు 107 మంది సభ్యులు మద్దతివ్వగా, 62 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందినందువల్ల.. రాజ్యసభ ఆమోదంతో బొగ్గు బిల్లుకు పార్లమెంట్ ఆమోద ప్రక్రియ ముగిసినట్లైంది. బిల్లులో కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, పీ భట్టాచార్య, సీపీఎం సభ్యులు పీ రాజీవ్(సీపీఎం), కేఎన్ బాలగోపాల్, సీపీఐ సభ్యడు రాజా తీసుకువచ్చిన సవరణలు వీగిపోయాయి. ఓటింగ్ సమయంలో జేడీయూ నేత శరద్ యాదవ్, తమ పార్టీ సభ్యులతో పాటు వాకౌట్ చేశారు. అంతకుముందు జరిగిన స్వల్పకాలిక చర్చకు బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సమాధానమిచ్చారు. బొగ్గు గనులున్న రాష్ట్రాలు, బొగ్గును వినియోగిస్తున్న రాష్ట్రాలు.. ఈ రెండింటి ప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందని హామీ ఇచ్చారు. నియమ, నిబంధనల రూపకల్పనలో ఎంపిక కమిటీ సూచలనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
గోయెల్ పేర్కొన్న ఇతర అంశాలు..
జాయింట్ వెంచర్లలో విదేశీ కంపెనీలకు అవకాశమివ్వబోం. దేశీయ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కూడా 26 శాతానికి మించనివ్వం.
చిన్నతరహా వినియోగదారుల కోసం ప్రత్యేక కోటాను ఏర్పాటు చేయాలని కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశిస్తాం.
స్థానికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం డిస్ట్రిక్ట్ మినరల్ కమిటీల ఏర్పాటు.
బొగ్గు గనులున్న అన్ని ప్రధాన రాష్ట్రాల్లో.. బొగ్గు వెలికితీత వల్ల ఏర్పడుతున్న కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రతీ రాష్ట్రంలో ఒక్కో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు.
పరిహార చెల్లింపుల కోసం కమిషనర్ ఆఫ్ పేమెంట్స్’ నియామకం
సుప్రీం రద్దు చేసిన 204 గనులను బిల్లులో ‘షెడ్యూల్ 1’ గనులుగా పేర్కొన్నారు. వాటిలో ఉత్పత్తి చేస్తున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 42 గనులను ‘షెడ్యూల్ 2’గా వర్గీకరించారు.
ఖనిజాల బిల్లు..
రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సూచించిన సవరణకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో.. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు రాజ్యసభ అడ్డంకి దాటేసింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ బిల్లులో ఈ సవరణను చేర్చడంతో బిల్లు మరోసారి లోక్‌సభకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, రాజ్యసభ ఆమోదం పొందిన 20 నిమిషాల్లోనే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడం విశేషం. రాజ్యసభలో కాంగ్రెస్, వామపక్షాలు మినహా అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతివ్వగా, ఓటింగ్ ముందు జేడీయూ వాకౌట్ చేసింది. అనుకూలంగా 117 ఓట్లు, వ్యతిరేకంగా 69 ఓట్లు వచ్చాయి. అంతకుముందు, రాష్ట్రాలు సహా, మిత్ర పక్షాలతో సంప్రదింపులు అవసరమని, అందువల్ల బిల్లును మళ్లీ ఎంపిక కమిటీకి పంపాలన్న రాజీవ్(సీపీఎం) తీర్మానంపై ఓటింగ్ జరగ్గా.. మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్, విపక్ష పార్టీలైన టీఎం సీ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకే, డీఎంకే, జేఎంఎంలు వ్యతిరేకిస్తూ ఓటేశాయి. తీర్మానాన్ని కాంగ్రెస్, వామపక్షాలు సమర్థించాయి. మైనిం గ్ లెసైన్సులను గతంలో గరిష్టంగా 30 ఏళ్ల లీజుకు ఇచ్చేవారు. ప్రస్తుత బిల్లులో 50 ఏళ్లుగా మార్చారు.
నల్లబంగారం కథ
దేశాన్ని పదేళ్లు ఏలిన యూపీఏ ప్రభుత్వాన్ని చావుదెబ్బ తీసింది బొగ్గు స్కాం. దేశ కుంభకోణాల చరిత్రలోనే.. రూ. 1.86 లక్షల కోట్ల భారీ లూటీ (కాగ్ నివేదిక)తో చరిత్ర సృష్టించింది.
విపక్ష బీజేపీ ఒత్తిడిపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. స్కాం సుప్రీంకోర్టు ముందుకు చేరింది.
2014 జూలైలో స్కాం కేసుల విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు.
2014 సెప్టెంబర్ 24న, 1993 నుంచి 2010 వరకు జరిగిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
2015, మార్చిలో స్కాం నిందితుడిగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు సమన్లు వచ్చాయి.
2014 మేలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అదే సంవత్సరం 21న బొగ్గు క్షేత్రాల వేలం ఆర్డినెన్స్ జారీ చేసింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌పై బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ.. విపక్షాలు అడ్డుకోవడంతో రాజ్యసభ లో మాత్రం గట్టెక్కలేకపోయింది. డిసెంబర్ 26న మరోసారి అదే ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ మార్చి 4 బొగ్గు బిల్లు లోక్‌సభ ఆమోదించింది.
విపక్షం డిమాండ్‌తో మార్చి 11న రాజ్యసభ ఎంపిక కమిటీకి నివేదన .
మార్చి 18న కమిటీ నివేదిక అందజేత.
కేవలం 33 బొగ్గు గనుల వేలంలో ఇప్పటికే ప్రభుత్వానికి రూ. 2.13 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 214 గనుల కేటాయింపుతో ఖజానా నష్టపోయిందని కాగ్ చెప్పిన మొత్తం కన్నా ఇది ఎక్కువ.