cognitive behavioural therapy
-
కోవిడ్-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్- కోవ్-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది. కోవిడ్-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. -
తలనొప్పికి 'యాప్' రాత
తల నొప్పితో బాధపడేవారికి శుభవార్త. తలనొప్పి ట్రీట్ మెంట్ కోసం కొత్త మార్గాన్ని అన్వేషించిన సైంటిస్తులు కొత్త యాప్ ను డెవలప్ చేశారు. తలనొప్పి కారణంగా ఎంత మొత్తంలో బాధను రికార్డు చేయడానికి యాప్ దోహదపడుతుందని సైంటిస్టులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ హెల్త్ ఇనిస్టిట్యూట్ బిహేవియరల్ బేసిస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్ అనే సంస్థకు సంబంధించిన ప్రొఫెసర్ పాల్ మార్టిన్ అధ్యయనంలో భాగంగా యాప్ వాడినట్టు తెలిసింది. తలనొప్పితో బాధపడేవారు ఉపశమనం పొందేందుకు లర్నింగ్ టు కోప్ విత్ ట్రిగ్గర్స్ (ఎల్ సీటీ) అనే విధానాన్ని మార్టిన్ డిజైన్ చేశారు. ఎల్ సీటీ తోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానాన్ని ఉపయోగించినట్టు వెల్లడించారు. అలసట, శబ్ద కాలుష్యం, కలుషిత ఆహార పదార్థాల కారణంగా వచ్చే తలనొప్పి తీవ్రతను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ హెడెక్ డైరీలో డేటాను నిక్షిప్తం చేస్తుందని శాస్త్రజ్క్షులు తెలిపారు. రోజువారి తలనొప్పి తీవ్రత రేటింగ్ ఆధారంగా బాధను అరికట్టేందుకు చికిత్సను డిజైన్ చేసే అవకాశం ఉంటుందన్నారు.