commissoner
-
Karimnagar: బల్దియా కమిషనర్, కార్పొరేటర్ల మధ్య కొత్త వివాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్త వివాదం మొదలైంది. కమిషనర్ వల్లూరి క్రాంతి, అధికార టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య అంతరం పెరిగింది. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వని కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని 32 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సంతకాలతో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం అందజేయడం కొత్త చర్చకు దారితీసింది. కౌన్సిల్లో ఉన్న 40 మంది టీఆర్ఎస్ సభ్యుల్లో సీనియర్లు 8 మంది మినహా 32 మంది కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని మంత్రి కమలాకర్, మేయర్ సునీల్‌రావుకు విన్నవించడం గమనార్హం. తమకు గౌరవం ఇవ్వడం లేదనే సాకుతోనే కార్పొరేటర్లు కమిషనర్ బదిలీకి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ శశాంక బదిలీ కాగా, ఆయన స్థానంలో ఆర్వీ కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన కరీంనగర్ కమిషనర్‌ను మాత్రం మార్చలేదు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు కరీంనగర్ కమిషనర్‌ను కూడా మార్చాలని కోరుతుండడం గమనార్హం. ఐఏఎస్ అధికారి కావడంతో... కరీంనగర్ కార్పొరేషన్‌కు గతంలో గ్రూప్–1 అధికారులు కమిషనర్లుగా వ్యహరించేవారు. మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన కె.శశాంక తొలి ఐఏఎస్ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆయన బదిలీ తరువాత మళ్లీ గ్రూప్–1 అధికారులనే నియమిస్తూ వచ్చినప్పటికీ, ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి వల్లూరి క్రాంతి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి, స్మార్ట్‌సిటీ పనుల విషయంలో కమిషనర్‌గా నిబంధనల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. క్రాంతి వచ్చినప్పటి నుంచి కరోనా ప్రభావమే ఉండడంతో పనుల్లో వేగం తగ్గింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలోనూ ఆలస్యం జరుగుతోంది. పనుల నాణ్యతను బట్టి బిల్లుల మంజూరీకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం కార్పొరేటర్లకు నచ్చడం లేదు. మొరం పనులతో మొదలై.. కరీంనగర్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీగా వరద చేరి చెరువుల్లా తయారయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో మొరం నింపాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌కు విన్నవించారు. అందుకు సమ్మతించిన అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే.. టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించాలని కొందరు కార్పొరేటర్లు ప్రతిపాదించి, వెంటనే అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. నామినేషన్ ప్రతిపాదనలను కమిషనర్ పక్కన పెట్టడంతో కొందరు కార్పొరేటర్లు సంతకాల సేకరణకు తెరలేపారని సమాచారం. వీటితోపాటు ఇటీవల పట్టణ ప్రగతిలో చేసిన పలు పనులు నాసిరకంగా ఉండడంతో, సదరు కాంట్రాక్టర్లను మందలించి, పూర్తిస్థాయి బిల్లులు కాకుండా, చేసిన పనులకే చెల్లించారని.. తద్వారా అగ్గి రాజకుందని ప్రచారం జరుగుతోంది. కమిషనర్ నిర్ణయాలను శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు చాలాసార్లు మంత్రికి, మేయర్‌కు దష్టికి తీసుకుని వెళ్లినా.. సర్దిచెప్పి పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పనులు లోపభూయిష్టంగా ఉండడంతో బిల్లులు మంజూరు కాకుండా కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వీటితోపాటు ఉద్యోగుల్లో సైతం జవాబుదారి తనం పెంచేందునకు చర్యలు తీసుకుంటుండడం కూడా నచ్చడం లేదు. కార్పొరేటర్ భర్తలకు కనీస గౌరవం లేదా..? కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిపి 60 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, వారిలో సగం అంటే 30 మంది మహిళా కార్పొరేటర్లే. మహిళలు కార్పొరేటర్లుగా గెలిచినా.. ఒకరిద్దరు మినహాయించి మిగతా వారిని ముందుండి నడిపించేది వాళ్ల భర్తలే. ఈ క్రమంలో సాధారణంగా 80 శాతం మంది మహిళా కార్పొరేటర్ల భర్తలే ఆయా డివిజన్లలో జరిగే పనులకు కాంట్రాక్టర్లుగా వ్యహరించడం లేక కుటుంబసభ్యుల్లో ఒకరి పేరిట పనులు చేయించడం జరుగుతోంది. అలాగే.. కమిషనర్, ఇతర అధికారులను కార్పొరేటర్ల భర్తలే కలిసి అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని, కార్పొరేషన్‌కు వెళ్లినా అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని మహిళా కార్పొరేటర్ల భర్తలు ‘ఆవేదన’ చెందుతున్నారు. అత్యవసర పనులకు నామినేషన్ పద్ధతిలో మంజూరు ఇచ్చేది కమిషనరే కావడంతో కరోనా సమయంలో పట్టణంలోని వార్డుల్లో కోట్లాది రూపాయల పనులు ఇదే పద్ధతిలో జరిగాయి. అయితే.. నామినేషన్ మీద జరిగిన పనులను పరిశీలించి బిల్లులు మంజూరు చేయాల్సిన కమిషనర్ అనుకూలంగా స్పందించడం లేదని చెపుతున్నారు. -
నగరంలో స్వచ్ఛ సర్వే ప్రారంభం
విజయవాడ సెంట్రల్ : నగరంలో స్వచ్ఛసర్వేక్షణ్ సర్వే మంగళవారం ప్రారంభమైంది. చాంబర్లో కమిషనర్ వీరపాండియన్ చాంపర్లో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం సభ్యులు శ్రావణ్‌కుమార్, సీతారామిరెడ్డితో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు నమ్మా, పబ్లిక్ టాయ్‌లెట్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. లిట్టర్‌ఫ్రీ నగరంలో తీర్చిదిద్దామని, చెత్త విభజన, స్క్రాప్పార్క్, కాల్వగట్ల సుందరీకరణ, పోస్టర్ ఫ్రీ, సోలార్ సిటీగా మార్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మింగ్ విజయవాడ క్యాంపెయినింగ్లో భాగంగా కళాశాలల విద్యార్థులతో సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా గోడలపై రంగుల చిత్రాలు వేయించినట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మూడురోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ ఆర్.అంకయ్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు పి.ఆదిశేషు, జె.వి.రామకృష్ణ, ఈఈలు గోవిందరావు, పీవీకే భాస్కర్ పాల్గొన్నారు. -
బెజవాడకు మంచిపేరు తెండి
విజయవాడ సెంట్రల్ : వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచి బెజవాడకు మంచిపేరు తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకాంక్షించారు. ఈనెల 22, 23 తేదీల్లో కోల్‌కతాలో జరిగే వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వి.వెంకట ప్రణీత, మ్యాట్మన్ స్కూల్ నుంచి టి.మాధవ్, నలంద పబ్లిక్ స్కూల్ నుంచి ఎన్.సుశీల్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరిని టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గురువారం కమిషనర్ చాంబర్‌కు తీసుకువచ్చారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అభివృద్ధి పరిచే అంశంపై 2016కు సంబంధించి ఎరువులు లేకుండా బలమైన పోషకాలతో తాము తయారుచేసిన ఆర్గానిక్ పౌడర్ గురించి విద్యార్థులు కమిషనర్‌కు వివరించారు. పాడైన పండ్లు, కూరగాయలను ఉడికించి, డ్రై చేసి దాన్ని పౌడర్‌గా తయారుచేసినట్లు తెలిపారు. ఈ ఆర్గానిక్ పౌడర్ చేపలు, రొయ్యలు, మేకలు, ఆవులు వంటి జంతువులకు ఆహారంగా వినియోగించవచ్చన్నారు. రోబో రాయల్ టీమ్స్ తరఫున తాము వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నట్లు వివరించారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలవాలని కమిషనర్ విద్యార్థులకు సూచించారు. -
ఉత్సవంలా అమరావతి ఫెస్టివల్
విజయవాడ సెంట్రల్ : అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఉత్సవంలా నిర్వహించాలని కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పీడబ్లు్యడీ గ్రౌండ్లో జరుగుతున్న పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయడంలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పూల కుండీలను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొన్నారు. పీడబ్లు్యడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెత్తను డంపర్‌బిన్స్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. షాపింగ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు మంచినీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తరుచు కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పారిశుధ్య సిబ్బందిని అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఒన్‌టౌన్ పంజాసెంటర్ రైల్వే స్టేషన్ వద్ద ముసాఫర్‌ఖానాను తొలగించి ఉర్దూఘర్‌కం షాదీఖానా షాపింగ్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రోడ్ల విస్తరణ అనంతరం రైల్వే సరిహద్దు గోడ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, ఈఈ ఉదయ్‌కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, యూసీడీ పీవో ఎం.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్కాచ్ అవార్డులు బెజవాడ స్థాయిని పెంచాయి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ చరిత్రలో స్కాచ్ అవార్డులు ఓ మైలురాయిగా మిగిలిపోతాయని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం కౌన్సిల్ హాల్లో కమిషనర్ జి.వీరపాండియన్, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఒకేసారి ఐదు అవార్డులు సాధించడం ద్వారా బెజవాడ స్థాయిని పెంచారని కొనియాడారు. మున్నెన్నడూ లేని విధంగా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి కావాలంటే కొంతమందిని ఇబ్బంది పెట్టక తప్పదన్నారు. ఢిల్లీ ముంబయిల స్థాయిలో మార్పు: కలెక్టర్ బాబు జిల్లా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నగరపాలక సంస్థ స్థాయిని పెంచాయన్నారు. ప్రజల వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చిందన్నారు. ఢిల్లీ, ముంబై తరహాలో నగరంలో మార్పు కనిపిస్తోందన్నారు. పుష్కర ఘాట్లను టూరిస్ట్‌స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ తన హయాంలో ఐదు అవార్డులు రావడం మధురమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా వేడుకల్ని పురస్కరించుకొని సేవలందిస్తున్న కార్పొరేషన్‌కు యూజర్ చార్జీలు చెల్లించే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. పోలీస్‌శాఖకు ఏటా రూ.50 లక్షలు యూజర్ చార్జీలు చెల్లిస్తున్నారు కాబట్టి తమకూ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 23 ప్రాంతాల్లో సోలార్ కేంద్రాలు: వీరపాండియన్ ప్రజాప్రతినిధులు సహకరిస్తే మరిన్ని అవార్డులు సాధించవచ్చని కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. బహిరంగ మలమూత్ర రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నగరంలో 23 ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్ మొౖ»ñ ల్యాప్ మెరుగైన ఫలితాలను ఇస్తోందన్నారు. భవిష్యత్‌లో అన్ని రకాల పన్నులు ఈ యాప్‌ద్వారానే వసూలు చేసే విధంగా యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉప మేయర్ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
మీ కృషి వల్లే అవార్డుల పంట
విజయవాడ సెంట్రల్ : మీ (ఉద్యోగుల) అందరి కృషి వల్లే నగర పాలక సంస్థకు అవార్డుల పంట పండిందని కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. స్కాచ్ సిల్వర్ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో ఐదు అవార్డుల్ని సాధించినందుకు గాను మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చాంబర్లో కమిషనర్ కల్సి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ సంస్కరణల అమల్లో అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అవార్డులు దక్కాయన్నారు. జాతీయస్థాయిలో పలు నగరాల మధ్య జరిగిన పోటీలో మూడోస్థానంలో నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరిన్ని అవార్డులు రావడం తథ్యమన్నారు. టీం వర్కే తన విజయరహస్యమన్నారు. సబ్ కలెక్టర్ సృజన కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డి.ఈశ్వర్, జి.అజయ్ ఉద్యోగులు పాల్గొన్నారు -
కమాండ్ కంట్రోల్ రూం పనుల్ని వేగవంతం చేయండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనుల్ని వేగవంతం చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సోమవారం పనుల్ని పరిశీలించారు. నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలో పనుల్ని పూర్తి చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నగరంలో చెత్త, నీటి సరఫరా తదితర అంశాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చన్నారు. కృష్ణా పుష్కరాల్లో ప్రయోగాత్మకంగా దుర్గాఘాట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) నరసింహమూర్తి, ఈఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.