డ్వాక్రా పేరుతో టోకరా
కందుకూరు: డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక రవాణా డొల్లతనం బయటపడిన సంఘటన ఇది. మంగళవారం రేషన్‌షాపు తనిఖీకి వెళ్లిన ఆర్ఐ సంబంధిత డీలర్ రాకపోవడంతో వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఓ నిర్మాణానికి ఇసుక తోలేందుకు లోడుతో ఓ ట్రాక్టర్ అక్కడికి వచ్చింది. ఈ ట్రాక్టర్ని ఆపిన ఆర్ఐ కృష్ణప్రసాద్ తనిఖీ చేశారు. డ్వాక్రా సంఘాల నుంచి జారీ చేసినట్లు ఉన్న స్లిప్‌ని పరిశీలించగా అందులో వివరాలు ఏమీ లేకుండా కేవలం తేదీ, ట్రాక్టర్ నంబరు మాత్రమే వేసి పంపారు.
స్లిప్‌లో ఉండాల్సిన బిల్‌బుక్ నంబర్‌గాని, సీరియల్ నంబర్‌గాని లేకపోవడం గమనార్హం. అదే స్లిప్ పట్టుకుని అప్పటికే ఆ ట్రాక్టర్ యజమాని నాలుగు ట్రిప్పులు ఇసుకను తోలి వెళ్లాడు. అంటే దాదాపు ట్రిప్పుకు రూ.3వేల చొప్పున రూ.12వేల ఇసుకను అప్పటికే తరలించారు. కానీ ఒక ట్రిప్పుకి మాత్రమే స్లిప్ తీసుకున్నారు. అంటే మిగిలిన మూడు ట్రిప్పుల డబ్బులు నాయకుల జేబుల్లోకి చేరాయి.
కందుకూరు మండలంలోని పాలూరు గ్రామంలో డ్వాక్రా సంఘానికి కేటాయించిన ఇసుక రీచ్‌లో జరిగిన తంతు. విషయం బయటపడడంతో రంగంలోకి దిగిన నాయకులు ఫోన్ల ద్వారా ఆర్ఐపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇక చేసేదేమీ లేక ఆర్.ఐ.తీసుకున్న స్లిప్ సంబంధిత డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించేశాడు. ఇదీ ఇసుక రవాణాలో జరుగుతున్న అవినీతి తంతు.