నకిలీ డొంక కదిలేనా?
జేడీతో సమావేశమైన విత్తన కంపెనీల డీలర్లు
రాజీ కోసం యత్నాలు!
విత్తనాల ధరలు చెల్లించి చేతులు దులుపుకొనే యత్నం
సమస్యను కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేందుకు తంటాలు
నకిలీ విత్తన కంపెనీల గుట్టు బట్టబయలవడంతో వాటి డీలర్లు, యాజమాన్యాలు రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ దందా ఓ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లోనే సాగిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నెమ్మదిగా కోల్డ్స్టోరేజీలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ మిర్చి విత్తనాల గండం నుంచి గట్టెక్కేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తంటాలు పడుతున్నారు. ఈ విత్తనాల వ్యాపారంలో వ్యవసాయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. నకిలీ దందా.. జిల్లాకు చెందిన ఓ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లో సాగింది. ఈ నేపథ్యంలో నకిలీల వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజీలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నష్టనరిహారాన్ని కంపెనీల నుంచి రాబడతామని, విత్తన యజమానులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని హడావుడి చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఈ వ్యవహారంపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కేవలం ఆరుగురు డీలర్ల లైసన్సులు పూర్తిగా రద్దు చేయడంతో పాటు జీవా కంపెనీకి చెందిన 19 మంది డీలర్లకు, బ్రహ్మపుత్ర కంపెనీకి చెందిన 28 మంది డీలర్లకు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టారు.
చర్యలపై వ్యవసాయ శాఖ కమిషనర్ చర్చ...
వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి వ్యవసాయ శాఖ కమిషనరేట్లోని కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల జేడీలు, నకిలీ విత్తనాల దర్యాప్తు కోసం నియమించిన ఆరు ప్రత్యేక బృందాలు, కమిషనరేట్లోని సీడ్ షెల్ అధికారులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కమిషనరేట్ నియమించిన ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెల్లడైన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. టీంలు ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకొనే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కే ఉంది. ఈ నేపథ్యంలో జేడీలు ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో శుక్రవారం సాయంత్రంలోపు సమాచారాన్ని తెలియజేయాలని కమిషనర్ ఆర్.ధనుంజయరెడ్డి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. నకిలీ విత్తనాలని బయటికి పొక్కగానే కొంతమంది డీలర్లు రైతులకు విత్తనాల ధర చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా సరిచేసుకున్నట్లు తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. అలాంటి విత్తనాలు సైతం ఎక్కడనుంచి వచ్చాయో ఆరా తీయాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎక్కువ శాతం విత్తనాలను అనుమతి లేకుండానే విక్రయించినట్లు తనిఖీ బృందాల పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీల గుట్టు బయటపడేనా అనేది తెలుసుకోవాలంటే ఇంకా వేచిచూడాల్సి ఉంది.
రాజీ ఫార్ములా సిద్ధం!
జిల్లాలోని విత్తన డీలర్లు, వ్యవసాయ సంయుక్త సంచాలకులతో గురువారం సమావేశమై నకిలీ విత్తన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. వ్యవసాయ అధికారులకు ఇబ్బంది కలుగకుండా, డీలర్లు నష్టపోకుండా మధ్యేమార్గంగా రాజీ ఫార్ములా సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులకు నష్ట పరిహారంతో సంబంధం లేకుండా, విత్తనాల ధర చెల్లించి వారిని కన్విన్స్ చేయాలని అధికారులు ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. వీరంతా నకిలీల గండం నుంచి గట్టెక్కే మార్గాలపైనే చర్చ సాగినట్లు తెలిసింది.