ఇందిర జలభ్రమ
సాక్షి, రాజమండ్రి : ‘రెక్కలు ముక్కలయ్యేలా అటవీ భూములను చదును చేసుకుని సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఏం లాభం వాన తడికి వేసిన ఆరుతడి పంటలు కోతకు వచ్చేసరికి ఎండి పోవడం రివాజుగా మారిపోతోంది. పోడు భూముల్లో వానలేని రోజుల్లో నేలకు కాస్త చెమ్మ తగిలితే చాలు బంగారం పండించుకుందుము బాబూ’ అంటూ ఆనాడు గిరిజనులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మొర పెట్టుకున్నారు.
ఫలితంగా ఇందిర ప్రభ పథకాన్ని ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ మెట్ట భూములకు సాగునీరందించుకునే కలను మహానేత సాకారం చేశారు. కానీ ఈనాడు ఆ పథకం అమలు కల్లగా మారిపోయింది. ఇందిర జలప్రభగా పేరు మార్చిన కిరణ్ సర్కారు పథకాన్ని పూర్తి భ్రమగా మార్చేసింది.
ఆర్భాటంతో సరి
కాంప్రహెన్సివ్ ల్యాండ్ డవలప్మెంట్ ప్రోగ్రాం(సీఎల్డీపీ)లో భాగంగా నిధులు విడుదల చేసి సమీపంలోని కొండ కాలువలు, చెరువుల నుంచి పైపుల ద్వారా పొలాలకు నీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. 2009లో ఆయన మరణానంతరం ఈ పథకం కుంటినడకన సాగుతోంది. తర్వాత ఇందిర జలప్రభగా పేరు మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో 10 లక్షల ఎస్సీ, ఎస్టీ భూములను సాగుయోగ్యంగా మారుస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా జిల్లాలో 28,000 ఎకరాలు సాగులోకి తెస్తామని ప్రకటించి 2011 సెప్టెంబర్‌లో రూ.33.94 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీఓ నెంబరు 315ను విడుదల చేసింది. కానీ ఆర్భాటం అంతా జీవోకే పరిమితం కాగా పథకం చతికిల బడింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే పథకం పూర్తిగా అటక ఎక్కినట్టేనని అనిపిస్తోంది.
22 మండలాల్లో.. జిల్లాలో ఏడు క్లస్టర్లలోని 22 మండలాల్లో పథకం అమలులో ఉంది. అడ్డతీగల క్టస్టర్ పరిధిలో అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలు. రంపచోడవరం క్టస్లర్ నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం, రంపచోడవరం మండలాలు. కాకినాడ క్లస్టర్ నుంచి గొల్లప్రోలు, కత్తిపూడి క్లస్టర్ నుంచి తుని, తొండంగి, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, పెద్దాపురం క్లస్టర్ నుంచి రంగంపేట, పెద్దాపురం. ప్రత్తిపాడు క్లస్టర్లో గోకవరం, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రాజమండ్రి క్లస్టర్ నుంచి కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేశారు.
అమలు ఇలా.. 2011లో 15,778 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఇందులో 636 ఎస్సీ లబ్దిదారులకు చెందినభూమి 860 ఎకరాలు ఉండగా, 4822 మంది గిరిజనులకు చెందిన 14,918 ఎకరాలు ఉంది. ఈ భూమిని సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం 1072 బ్లాకులుగా విభజించి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2011 సంవత్సరాంతానికి 356 బ్లాకుల్లో 1744 పనులు ప్రతిపాదించారు.
కాగా వీటిలో ఇప్పటికి 342 బ్లాకుల్లోని 1500 లకు పైగా పనులకు పరిపాలనా పరమైన అనుమతులు లభించగా 107 బ్లాక్‌లలోని 326 పనులు పూర్తిచేయగలిగారు. ఇంకా 78 డివిజన్లలో 136 పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. రెండేళ్లుగా పనుల్లో ప్రగతి మందగించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తిగా స్తంభించినట్టు తెలుస్తోంది.