కిరాయి హంతకులను నియమించిన రైల్వే!!
లక్నో: అవి చిన్నాచితక చిట్టెలుకలు కావు. భారీ మూషికాలు. వాటిని చూస్తే పిల్లులకే లాగు తడుస్తుంది. బోనులు వాటిముందు బోసిపోతాయి. అందుకే రైల్వేశాఖ వాటిని చంపేందుకు ఏకంగా కిరాయి హంతకులను నియమించుకుంటోంది. ఇంతకు కిరాయి హంతకులను పెట్టుకొని మరీ ఎలుకల్ని తరమాల్సిన కష్టం రైల్వేశాఖకు ఎందుకొచ్చిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని చార్బాగ్ రైల్వేస్టేషన్ బ్రిటిష్ కాలంనాటిది. ఇది తాతల కాలంనాటి పురాతన స్టేషన్ కావడంతో ఇక్కడ ఎలుకలు తమ సంతతిని బాగా విస్తరించాయి. మరి ఎలుకలంటే మన ఇళ్లలో ఉండే 'జెర్రీ'లాంటి బుజ్జిబుజ్జి చిట్టెలుకలు కావు. భారీసైజులో ఉండే ఎలుకలు ఇక్కడ కాపురముంటూ.. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ల కింద పెద్ద పెద్ద సొరంగాలను తవ్వేస్తున్నాయి. రైల్వే ఆస్తులూ, బంగ్లాలకు కన్నాలు పెడుతున్నాయి. ప్రభుత్వ ఫైళ్లను కొరికేస్తున్నాయి. ప్రయాణికుల సరుకును ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. గత ఏడాది మూషికాల కారణంగా రైల్వే వెండార్స్‌కు రూ. 10 లక్షల నష్టం సంభవించింది.
ఇక లాభం లేదనుకున్న రైల్వేశాఖ రూ. 4.76 లక్షలతో ఎలుకలను చంపేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కాంట్రాక్టు ఏడాదిపాటు అమల్లో ఉంటుందని, ఈ నెల నుంచి ప్రారంభం కానుందని లక్నో (నార్తన్ రైల్వే) డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే సిన్హా తెలిపారు. ఎలుకల్ని చంపేందుకు ప్రత్యేకమైన నిపుణుల బృందం రంగంలోకి దిగనుంది. ప్లాట్‌ఫామ్‌లు, బంగ్లాలు, సమీపంలోని యార్డులను చుట్టుముట్టి ఈ బృందం ఎలుకల పని పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనమేరకు తినుబండారాలల్లో విషపదార్థాలను కలిపి ఎలుకల్ని మట్టుబెట్టనున్నారు.