చంద్రన్న బీమా జీవో కాపీలు దహనం
ప్రభుత్వ ఆదేశాలపై భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు
పెద్దాపురంలో నిరసన ప్రదర్శన
పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై పెద్దాపురం అర్బన్, రూరల్ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికులంతా రోడెక్కారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుంచి శోభా థియేటర్, నువ్వులగుంట వీధి, పాత ఆసుపత్రి మీదుగా మెయిన్ రోడ్డు వరకూ వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గడిగట్ట సత్తిబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందన్నారు. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమాలో కలిపితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను వారు దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రాజమహేంద్రపు రామారావు, సిద్ధాంతపు వెంకటరమణ, పాలిపర్తి భద్రరావు, కర్రి వీరశివ, ముమ్మన శ్రీను, బల్ల రాంబాబు, బుడత రవీంద్ర, గంగాధర్ పాల్గొన్నారు.