సంతకం.. సంకటం
విజయవాడలో ‘ఫోర్జరీ ముఠా’
రెవెన్యూ వర్గాల్లో కలవరం
రంగంలోకి దిగిన పోలీసులు
విజయవాడ సిటీ : నగరంలో ఫోర్జరీ ముఠాల కార్యకలాపాలు అధికమయ్యాయి. రెవెన్యూ.. రవాణా.. శాఖ ఏదైనా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ స్టాంపులతో బురిడీ కొట్టిస్తున్నారు. కీలక శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో ధ్రువీకరణ పత్రాల తయారీ వ్యవహారం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. విచారణ కోసం వచ్చే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఇవి వెలుగుచూస్తున్నాయి. రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, లంచాల కోసం కొందరు సిబ్బంది వేధింపులు భరించలేక.. అమాయకులు ఫోర్జరీ ముఠాల బారిన పడుతున్నారు.
నగరపాలక సంస్థ మంజూరు చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు రెవెన్యూ శాఖ జారీచేసే కుటుంబ ధ్రువీకరణ పత్రాలు, అడంగల్ కాపీలు, రవాణా శాఖ జారీచేసే వాహనాల సి-బుక్కులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బీమా పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్లు.. ఇలా ఏ ఒక్కదాన్నీ ఈ ఫోర్జరీ ముఠాలు వదలడం లేదు. ఆయా ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారిని తమ ఏజెంట్ల ద్వారా గుర్తించి నకిలీవి అంటగడుతున్నారు. అప్పటికప్పుడు పని జరిగిపోతుండడంతో ఈ ముఠాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నవారు మిన్నుకుండిపోతున్నారు.
సిబ్బంది సహకారం
విజయవాడలో పెద్ద సంఖ్యలో ఫోర్జరీ సంతకాల ముఠాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. వీరికి కొన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సహకారం ఉంది. ఉన్నతాధికారుల సంతకాలను వీరు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేస్తున్నారు. ఆయా కార్యాలయాల ముద్ర (రబ్బర్ స్టాంపు)లను కూడా వీరు తయారుచేయించి ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల్లోని కొందరు సిబ్బంది సహకారం కూడా ఉన్నట్లు వినికిడి. ఉన్నతాధికారుల నమూనా సంతకాలను అందజేయడంతోపాటు తమ సంస్థ ఉపయోగించే ముద్రల వివరాలను కూడా ఈ ముఠాల సభ్యులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు భారీగానే ప్రతిఫలం పొందుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
విజయవాడను రాజధానిగా చేస్తారని ప్రచారం జరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా కొనుగోళ్లు, అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో ఫోర్జరీ ముఠాలు రంగప్రవేశం చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారుచేసే అవకాశం ఉందనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా మోసాలు భారీగా జరిగేవి. ఇప్పుడీ ముఠాల దృష్టి నగరంపై పడినట్లు తెలుస్తోంది.
కూపీ లాగుతున్న పోలీసులు
ఫోర్జరీ ముఠాల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా కిడ్నీ దానం కోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కుటుంబ ధ్రువీకరణ పత్రం తయారు చేశారంటూ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట కూడా కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే తరహా మోసం జరిగింది. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
మూడు నెలల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి చెలామణి చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిట్టినగర్‌కు చెందిన ఆ యువకుడు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి ఆయా కంపెనీల ముద్రలను కూడా వేసి సొమ్ము చేసుకున్నాడు.
గత ఏడాది చివర్లో గాంధీనగర్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసిన ముఠా సభ్యులను రిజిస్ట్రార్ ఫిర్యాదుతో గవర్నరుపేట పోలీసులు అరెస్టు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముఠాల ఆచూకీపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. జి.కొండూరు మండల తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పాస్‌పుస్తకాలు పొందిన ముగ్గురిని కూడా అరెస్ట్‌చేశారు.