కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లో తపాలా సేవలు
విశాఖ పోస్టల్ రీజియన్లో తొలిసారిగా అమలాపురం నుంచి శ్రీకారం
ప్రారంభించిన రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత
అమలాపురం టౌన్ (అమలాపురం) : తపాలా సేవలపరంగా 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల తమ శాఖ ఇక నుంచి వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా, దీటుగా సేవలు అందించేందుకు కొత్తగా కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లోకి అడుగు పెట్టిందని విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత అన్నారు. ఈ సరికొత్త సేవలను తమ రీజియన్ పరిధిలోని అమలాపురం పోస్టల్ డివిజన్ నుంచే ప్రథమంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. అమలాపురంలోని డివిజన్ పోస్టల్ కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు)లో ఏర్పాటుచేసిన కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ విధానాన్ని ఆమె సోమవారం ఉదయం ప్రారంభించారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ జి.షణ్ముఖేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోర్ సిస్టమ్స్ వల్ల తపాలా సేవలు మరింత వేగంగా... పారదర్శకంగా అందనున్నాయన్నారు. ఈ విధానంతో దేశమంతా తపాలా సేవలు ఆన్లైన్ అనుసంధానంతో ఒకే ప్లాట్ ఫారంపైకి వచ్చినట్లయిందని చెప్పారు. వినియోగదారులు పోస్టల్ సేవలు పొందేందుకు తమ వద్ద ఉండే మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థతో పొందవచ్చని తెలిపారు. వాణిజ్య బ్యాంక్లు ఎన్ని రకాలు సేవలు అందిస్తున్నాయో అలాంటి సేవలన్నీ తమ శాఖ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుందన్నారు. తమ రీజయిన్ పరిధిలో 1,500 వాణిజ్య బ్యాంక్లు ఉంటే తమ తమ శాఖ కార్యాలయాలు ఆరు వేల ఉన్నాయని గుర్తు చేశారు. పోస్టల్ అంటే ఓ నెట్ వర్కింగ్...ఐటీ ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ వినూత్న, విస్తృత సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైతం ప్రచారం చేసేందుకు తమ సిబ్బంది ఫొటోలు, వీడియోలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా సాధ్యం కాదని...వారు కూడా ప్రజల్లోకి వెళ్లాలి...నోటి మాటలతో అర్థమయ్యే రీతిలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కోర్ సిస్టమ్స్ సేవలను రీజియన్ పరిధిలోని తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో జూలై నెలాఖరుకు విస్తరింప చేస్తామని... వచ్చే సెప్టెంబర్ నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపడతామని శ్రీలత వివరించారు.
త్వరలోనే రెండు పాస్ పోర్టు సేవా కేంద్రాలు
తమ పోస్టల్ శాఖ కోర్ సిస్టమ్స్ సేవలనే కాకుండా త్వరలోనే పోస్ట్ ఆఫీసుల్లో పాస్పోర్టు సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆ సేవలు అందించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీలత వెల్లడించారు. తొలి ప్రయత్నంగా రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో ఈ సేవా కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ, విదేశాంగ శాఖ ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చాని తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే పోస్టు ఆఫీసుల్లోనే పాస్పోర్టు దరఖాస్తు చేసుకునే వెసులబాటు వస్తుందన్నారు. అమలాపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్వీ రాజేష్, హెడ్ పోస్టు మాస్టర్ వై.ప్రసాద్, పోస్టల్ ఇన్స్పెక్టర్లు వి.హరిబాబు, బీవీఎల్ విశ్వేశ్వరరావు, ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. రీజియన్లో తొలిసారిగా అమలాపురంలో కోర్ సిస్టమ్స్ ప్రారంభానికి ముందు శ్రీలత కేక్ కట్ చేయటంతో సిబ్బంది వేడుక చేసుకున్నారు.