కీలక నిర్ణయాలు
వచ్చేనెల 4నుంచి శాసనసభ సమావేశాలు
కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు ఆమోదం
నగరోత్తన పథకం కింద రూ.7,300 కోట్లు వ్యయం
మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం
వివరాలు వెల్లడించిన మంత్రి జయచంద్ర
బెంగళూరు: వచ్చే నెల 4 నుంచి 29 వరకూ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రీటైల్ ట్రేడ్ పాలసీ-2015 అమలుకు కూడా మంత్రి మండలి పచ్చజండా ఊపింది. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖమంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వెల్లడించారు.
⇒నూతనంగా అమల్లోకి వచ్చే రీటైల్ ట్రేడ్ పాలసీ వల్ల ఆ రంగంలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా రీటైల్ సంస్థల పనివేళలతో పాటు , కార్మిక చట్టాల్లో కూడా మార్పులు రానున్నాయి.
⇒రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నుంచి ఆర్థిక సహకారం అందుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు మంత్రి మండలి పచ్చజండా ఊపింది.
⇒ నగరోత్తన పథకం కింద 2016-17,2017-18 ఏళ్లల్లో బెంగళూరులో వివిధ అభివృద్ధి పథకాల కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేయడానికి అంగీకారం.
⇒బళ్లారి, రాయచూర్, కొప్పళ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు రూ.432.55 కోట్లు విడుదల.
⇒తుమకూరు నుంచి శిర మీదుగా దావణగెరె వరకూ రైల్వే లైన్ల పనుల కోసం అవసరమై 235 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం రూ.1,801 కోట్ల నిధులు విడుదలకు మంత్రి మండలి అంగీకారం.
⇒{పస్తుత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్ జాదవ్ ఈనెల 30న రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో నూతన ముఖ్యకార్యదర్శి ఎంపిక విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కట్టబెడుతూ మంత్రి మండలి ఏకగ్రీవ నిర్ణయం. కాగా, ముఖ్యకారదర్శి రేసులో సీనియారిటీను అనుసరించి వరుసగా ఉపేంద్ర త్రిపాఠి, సుభాష్‌చంద్ర, రత్నప్రభ, ఎస్.కే పట్నాయక్‌లు ఉన్నారు. వీరందిరిలో ఏడాది తొమ్మిది నెలల సర్వీసు కలిగిన రత్నప్రభను ముఖ్యకార్యదర్శిగా ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
⇒పౌరసరఫరాల శాఖ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యం, రాగులు తదితర ఆహార పదార్థాలను చట్టవిరుద్ధంగా పొందడం కాని, నిల్వ చేయడం కాని చేసిన వారి వివరాలు చెప్పిన వారికి రూ.200 బహుమతి ఇవ్వడానికి అంగీకారం.