క్రైస్తవులపై చిన్నచూపు తగదు
ఏఐసీసీ జాతీయాధ్యక్షుడు రెవ.డాక్టర్ గేరహోనోక్
నెల్లూరు(బారకాసు) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నాయని, ఇది తగదని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు రెవ.డాక్టర్ గేరహోనోక్ అన్నారు. ఏఐసీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని రేబాల లక్ష్మీనరసారెడ్డి స్మారక భవనంలో బెస్ట్ పాస్టర్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గేరహోనోక్ మాట్లాడుతూ రాజ్యాంగం క్రైస్తవులకు కల్పించిన హక్కులను ఏప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పాస్టర్లను చంపుతూ, క్రైస్తవులను అణగదొక్కుతూ, చర్చిలను కూల్చాలనే ప్రయత్నాలు ప్రధానిమంతి నుంచి కింది స్థాయి ప్రజాప్రతినిధితో పాటు ప్రభుత్వాధికారులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. విజయవాడలో దేవాలయాలు, మసీదులను కూల్చివేసి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఇతర ప్రాంతాల్లో స్థలాలను కేటాయించి నిర్మాణానికి నిధులను విడుదల చేస్తుందన్నారు. అయితే చర్చిలను కూల్చివేసి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3వ తేదీన విజయవాడలో జరిగే క్రైస్తవ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాసరి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అభిలాష్సన్ని, జిల్లా గౌరవాధ్యక్షుడు బిషప్ ఎంజే ప్రదీప్‌కుమార్, రవికుమార్, బాబుబిల్డర్తో పాల్గొన్నారు.