ఎదురుకాల్పుల్లోఇద్దరికి గాయాలు
బరంపురం: గంజాం జిల్లాలో పోలీసులు, కరుడుగట్టిన నేరస్థుల మధ్య శనివారం అర్ధరాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్ ఇద్దరు క్రిమినల్స్ బంజనగర్కి చెందిన గౌరి స్వంయి, సహచరుడు భువనేశ్వర్‌కు చెందిన శ్రీకాంత్ స్వంయి అలియాస్ టేరుల కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. గౌరి, టేరు దగ్గర నుంచి రెండు విదేశీ తుపాకీలు, ఒక బైక్ మొబైల్ ఫోన్లను పోలీసులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.
దక్షిణాంచల్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని బుగడలో మానితార బ్యాంక్‌ను దోపిడీ చేసిన సంఘటనలో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు గంజాం పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారు. భువనేశ్వర్ నుంచి జిల్లాలోని బుగడకు నిందితులు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుగడలో నిఘా పెట్టారు.
ఇంతలో రెండు బైక్‌లపై బుగడ వైపు గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణా మరో ఇద్దరు సహచరులతో వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చినట్లు గమనించిన గౌరి స్వంయి, సహచరుడు శ్రీకాంత్ రాణా తొలుత పోలీసులపై బాంబుల దాడి చేశారు. అనంతరం తుపాకీలతో కాల్పులు జరిపారు.
తప్పించుకున్న సహచరులు
ఈలోగా చీకట్లో ఇద్దరు సహచరులు బుగడ ఆడవుల్లోకి పారిపోయారు. పోలీసులు ఆత్మ రక్షణగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల సంఘటనలో గౌరీ స్వయి, సహచరుడు శ్రీకాంత్ రాణాల నాలుగు కాళ్లకి తీవ్రగాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి 2 మౌజర్ (7ఎంఎం)పిస్టల్, 5 పేలని గుళ్లు, ఒక బైక్, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు మానవతా దృక్పథంతో తొలుత గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణాలను బుగడ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అనందరం మెరుగైన చికిత్సల కోసం ఎంకేసీజీ మెడికల్ కళాశాల అస్పత్రికి తరలించి వైద్యుల సహాయంతో చికిత్సలు జరిపారు.
కరుడు గట్టిన నేరస్థులు గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణాలు కొద్ది రోజుల క్రితం జరిగిన బుగడలోని మణితార బ్యాంక్ దోపిడీ సంఘటనలో ముఖ్య నిందితులని, గంజాం, కొంధమాల్ జిల్లాల్లో సుమారు 20కి పైగా దోపిడీ, దొంగతనాలు, హత్యా దాడులు వంటి నేరాలు ఉన్నాయని డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ చెప్పారు. తప్పించుకున్న మిగతా నిందితులను గాలిస్తున్నట్లు చెప్పారు.