ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాల గురించి గళమెత్తుతానే తప్పా...
నల్లగొండ: ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాల గురించి గళమెత్తుతానే తప్పా... అభివృద్ధి పనులకు అడ్డుచెప్పే వ్యక్తిని కాదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తాను అడ్డుపడుతున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని గుత్తా తిప్పికొట్టారు. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలు సరిదిద్దకుండా తనపై ఎదురుదాడికి దిగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని హితబోధ చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆర్ అండ్ బి అధికారులు రహదారుల పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన పనులు టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడం అభివృద్ధిని నిరోధించడమవుతుందని అన్నారు. నాన్‌సీఆర్‌ఎఫ్ కింద మంజూరైన నిధులతో దేవరకొండ ప్రాంతంలో టీఆర్‌ఎస్ నాయకులు ఇళ్లలో బోర్లు వేయించుకోవడాన్ని అవినీతి చర్యగా పేర్కొన్నారు. ఎంపీ నిధులతో చేపట్టిన రహాదారుల పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌తో విచారణకు ఆదేశించిన నైజం తనదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పు డే సూర్యాపేట నియోజకవర్గంలో రూ.35 కోట్లతో రోడ్లు నిర్మించానని, 2015-16లో మంజూరు కావాల్సిన 400 కేవీ సబ్‌స్టేషన్‌ను 2013-14లో మంజూరయ్యే విధంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం వరకే తన బాధ్యతని అన్నారు.