ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ ఘనత
హైదరాబాద్ : ఐటీశాఖ వార్షిక నివేదికను ఐటి శాఖా మంత్రి కె తారక రామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా రాష్ట్రం ఐటి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రకటించారు. 2015-16 ఏడాదిలో రూ 75,070 కోట్ల ఎగుమతి సాధించిందనీ , గత ఏడాదితో పోలిస్తే ఇది 13.26 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఐటి మంత్రి ప్రకటించారు.
2014-15లో ఐటీ ఎగుమతులు రూ. 67 వేల కోట్లు ఉండేదనీ, 2015-16లో ఐటీ ఎగుమతులు రూ. 75 వేల కోట్లు దాటాయని వెల్లడించారు. ఐటీ సెక్టార్లో సాధించిన పురోగతి ఇది నిదర్శనమన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వార్షిక నివేదికను నేడు మీడియాకు వెల్లడించిన మంత్రి తమ ప్రధాన లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఐటి మరియు ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్ ) ఎగుమతుల్లో పెరుగుదల జాతీయ సగటు 12.3 శాతం కంటే ఎక్కువ అని చెప్పారు. అలాగే మొత్తం 407, 385 ఉద్యోగాల్లో (వర్క్ ఫోర్స్) లో ఐటి రంగంలో నగరంలో దాదాపు 35, 611 కొత్త ఉద్యోగాలను సృష్టించామన్నారు.
గేమింగ్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు పాలసీలను ప్రకటించినట్లు పేర్కొన్న మంత్రి పాలనలో పారదర్శకతతో ఐటీకి పెద్దపీట వేశామన్నారు. టాస్క్ ద్వారా గత ఏడాది 45 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. టీహబ్ దేశానికే రోల్‌మోడల్‌గా మారింది.
డిఫెన్స్ సెక్టార్లో టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు రక్షణశాఖ ముందుకు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తెలంగాణా రూపకల్పనలో కృషిచేసిన ఐఐటి బాసర విద్యార్థుల, ఇతరవిద్యార్థులకు ప్రతిభ అవార్డులను, నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. 100 శాతం డిజిటల్ లిటరసీ సాధించిన బాసర, నారసింగ్ పూర్ సర్పంచులను అవార్డులతో సత్కరించారు.