crossed
-
భారత్‌లోకి చొరబాటు.. త్రిపురలో ఐదుగురి బంగ్లాదేశీయులు అరెస్ట్
అగర్తల: బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురిని త్రిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీయులను ఆదివారం త్రిపురా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు.‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ ప్రారంభించాం. వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు. అరెస్ట్ అయిన ఐదుగురు బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి డివిజన్లోని చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లా పౌరులు భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి. -
భారత్‌లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు. -
ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకుంది. సీమా.. భారత్ వచ్చేందుకు పాకిస్తాన్‌లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అంజు రాజస్థాన్‌కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్‌కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్‌లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. జవేరియా ఖానుమ్ జావేరియా పాకిస్తాన్‌లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించింది. బార్బరా పొలాక్ జార్ఖండ్‌లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్‌కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్‌ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణా మండల్ కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్‌ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించింది. ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్‌డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
మయన్మార్ నుంచి భారత్‌కు 15వేల మంది: ఐరాస
ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. ప్రజల నిరసనలపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 1,120 మంది చనిపోయినట్లు అంచనా. ఘర్షణలు, హింసాకాండ నేపథ్యంలో మయన్మార్ నుంచి 15,000 మందికిపైగా పౌరులు సరిహద్దు దాటి, భారత్‌లోకి ప్రవేశించారని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు? ఈ మేరకు ఆయన ‘మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు, ఇతర మైనార్టీల మానవ హక్కుల పరిస్థితి’పేరిట ఒక నివేదికను ఐరాస సర్వ సభ్య సమావేశంలో సమర్పించారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి 1 కంటే ముందే సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 3.36 లక్షల మంది సొంత ప్రాంతాలను వదలిపెట్టారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత 2.20 లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని వివరించారు. మరో 15వేల మందికిపైగా జనం సరిహద్దు దాటి, పొరుగు దేశమైన భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. చదవండి: నేడు గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు -
తవ్వుకో..దోచుకో...
వాల్టా చట్టానికి విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలు అధికార పక్షం నేతల నిర్వాకం కొల్లూరు: చట్టాలను తమకు చుట్టాలుగా చేసుకొని అధికార పక్షం నాయకులు పాల్పడుతున్న ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. వాల్టా చట్టాన్ని అతిక్రమించి కృష్ణా నదిలో పట్టపగలే యంత్రాలతో ఇసుకను తరలించుకుపోతున్నా యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కొల్లూరు మండలంలోని పెసర్లంక అరవిందవారధి సమీపంలో సోమవారం అధికార పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్ల సాయంతో ఇసుక తవ్వకాలకు తెగబడ్డారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి నదిలో నీటి ఊటలు బయటపడేలా యంత్రాలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించుకు పోవడం చూసి ప్రజలు విస్తుపోయారు. సోమవారం ఒక్క రోజే సుమారు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలించారు. అభివృద్ధి పనుల నెపంతో అక్రమాలు.. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల అరవిందవారధికి ముప్పు తప్పదని పలుమార్లు ఆర్ అండ్ బి అధికారులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా ఆర్ అండ్ బీ చెందిన రహదారి నిర్మాణానికి ఈ అక్రమ తవ్వకాలు చేపట్టడం విశేషం. అభివృద్ధి పనుల నెపంతో ఇలా ఇసుక తరలించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నదీపరీవాహక ప్రాంత గ్రామాలను ముంచి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం తగదని పలువురు వాపోతున్నారు. యంత్రాల సాయంతో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఇప్పటికే అడుగంటిన భూగర్భ జలాలు మరింత అడుగంటి సాగు, తాగు నీటి కష్టాలు ఏర్పడతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారధి సమీపంలో 2006 తుపానుకు కోతకు గురైన ప్రాంతంలోనే తవ్వకాలు చేపడుతుండటంతో నదికి చిన్న వరద వచ్చినా ముప్పు గ్రామాలపైన పడే ప్రమాదం ఉందనేది ప్రజల వాదన. నీటి పారుదల శాఖ కార్యాలయ ఖాళీ ప్రదేశ అభివృద్ధి, రహదారి నిర్మాణానికి అవసరమైన ఇసుక మండలంలో ఉన్న జువ్వలపాలెం ఉచిత ఇసుక క్వారీ నుంచి తెచ్చుకునే సదుపాయం ఉన్నా అక్రమ మార్గంలో తవ్వకాలు చేపట్టడం వెనుక అధికార పక్షానికి చెందిన నాయకుల ధనార్జనే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. రహదారి పనులు చేపడుతున్న కాంట్రాక్టరు వద్ద ఇసుక తరలింపునకు బేరం మాట్లాడుకొని నాయకులు సొమ్ము చేసుకోవడానికి నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నీటిపారుదల శాఖ ప్రదేశం అభివృద్ధి అనంతరం బిల్లులు పేరుతో రెట్టింపు సొమ్ము చేసుకునే తంతులో భాగమే ఈ అక్రమాలని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాగా, ఇసుక తరలిస్తున్న విషయాన్ని తెలుసుకుని పోలీసులు రెండు వాహనాలను అదుపులోకి తీసుకోగా, కొద్ది వ్యవధిలోనే కొల్లూరుకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు పోలీసు ఉన్నతాధికారులతో చెప్పించి వాహనాలను దర్జాగా బయటకు తీసుకెళ్లారు. ఇది చూసి అధికార పక్షం నాయకుల అక్రమాలకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రజానీకం చర్చించుకున్నారు. -
పొరపాటుగా భారత్ లోకి వచ్చిన పాక్ చిన్నారి
ఛండీగఢ్ః ఐదేళ్ల చిన్నారి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఇండియాలో ప్రవేశించింది. చెవిటి,మూగ సమస్యలతో బాధపడుతున్న ఆ పాకిస్తాన్ బాలిక పంజాబ్ అబోహార్ సెక్టార్ ప్రాంతం లోని సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు గుర్తించారు. భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం పదిన్నర గంటల ప్రాతంలో ఆ పాక్ చిన్నారి అంతర్జాతీయ సరిహద్దులు దాటింది. దీంతో సరిహద్దు స్థావరంలో పనిచేసే అభోర్ సెక్టార్ బీఎస్ఎఫ్ దళానికి చెందిన నతాసింగ్ వాలా బాలికను గమనించారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ బాలిక సరిహద్దు భద్రతా వలయంలోకి చేరినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఆర్ ఎస్ ఖటారియా తెలిపారు. అయితే అనుకోకుండా భారత్ లోకి ప్రవేశించిన ఆ ఐదేళ్ల చిన్నారిని ప్రశ్నించడంతో చెవిటి, మూగ అని తెలిసిందని, దీంతో ఆమెకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించలేక పోయిందని చివరికి పేరు కూడ తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఆమె సరిహద్దు దాటి వచ్చిందన్న హెచ్చరికలతో చిన్నారిని పట్టుకున్న దళాలు.. అనంతరం పాకిస్తాన్ రేంజర్స్ ను సంప్రదించి మానవతా దృక్పథంతో ఆ బాలికను ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.