తవ్వుకో..దోచుకో...
తవ్వుకో..దోచుకో...
Published Tue, Jul 26 2016 4:16 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
వాల్టా చట్టానికి విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు
అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలు
అధికార పక్షం నేతల నిర్వాకం
కొల్లూరు: చట్టాలను తమకు చుట్టాలుగా చేసుకొని అధికార పక్షం నాయకులు పాల్పడుతున్న ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. వాల్టా చట్టాన్ని అతిక్రమించి కృష్ణా నదిలో పట్టపగలే యంత్రాలతో ఇసుకను తరలించుకుపోతున్నా యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కొల్లూరు మండలంలోని పెసర్లంక అరవిందవారధి సమీపంలో సోమవారం అధికార పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్‌ల సాయంతో ఇసుక తవ్వకాలకు తెగబడ్డారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి నదిలో నీటి ఊటలు బయటపడేలా యంత్రాలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించుకు పోవడం చూసి ప్రజలు విస్తుపోయారు. సోమవారం ఒక్క రోజే సుమారు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలించారు.
అభివృద్ధి పనుల నెపంతో అక్రమాలు..
ఇసుక అక్రమ తవ్వకాల వల్ల అరవిందవారధికి ముప్పు తప్పదని పలుమార్లు ఆర్ అండ్ బి అధికారులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా ఆర్ అండ్ బీ చెందిన రహదారి నిర్మాణానికి ఈ అక్రమ తవ్వకాలు చేపట్టడం విశేషం. అభివృద్ధి పనుల నెపంతో ఇలా ఇసుక తరలించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నదీపరీవాహక ప్రాంత గ్రామాలను ముంచి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం తగదని పలువురు వాపోతున్నారు. యంత్రాల సాయంతో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఇప్పటికే అడుగంటిన భూగర్భ జలాలు మరింత అడుగంటి సాగు, తాగు నీటి కష్టాలు ఏర్పడతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారధి సమీపంలో 2006 తుపానుకు కోతకు గురైన ప్రాంతంలోనే తవ్వకాలు చేపడుతుండటంతో నదికి చిన్న వరద వచ్చినా ముప్పు గ్రామాలపైన పడే ప్రమాదం ఉందనేది ప్రజల వాదన. నీటి పారుదల శాఖ కార్యాలయ ఖాళీ ప్రదేశ అభివృద్ధి, రహదారి నిర్మాణానికి అవసరమైన ఇసుక మండలంలో ఉన్న జువ్వలపాలెం ఉచిత ఇసుక క్వారీ నుంచి తెచ్చుకునే సదుపాయం ఉన్నా అక్రమ మార్గంలో తవ్వకాలు చేపట్టడం వెనుక అధికార పక్షానికి చెందిన నాయకుల ధనార్జనే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. రహదారి పనులు చేపడుతున్న కాంట్రాక్టరు వద్ద ఇసుక తరలింపునకు బేరం మాట్లాడుకొని నాయకులు సొమ్ము చేసుకోవడానికి నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నీటిపారుదల శాఖ ప్రదేశం అభివృద్ధి అనంతరం బిల్లులు పేరుతో రెట్టింపు సొమ్ము చేసుకునే తంతులో భాగమే ఈ అక్రమాలని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాగా, ఇసుక తరలిస్తున్న విషయాన్ని తెలుసుకుని పోలీసులు రెండు వాహనాలను అదుపులోకి తీసుకోగా, కొద్ది వ్యవధిలోనే కొల్లూరుకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు పోలీసు ఉన్నతాధికారులతో చెప్పించి వాహనాలను దర్జాగా బయటకు తీసుకెళ్లారు. ఇది చూసి అధికార పక్షం నాయకుల అక్రమాలకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రజానీకం చర్చించుకున్నారు.
Advertisement
Advertisement