క్రమబద్ధీకరణపై ఎందుకింత ఆలస్యం?
* కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ జాప్యంపై సీఎస్ ఆగ్రహం
* 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 4 వేల ప్రతిపాదనలేనా?
* వారానికోసారి పురోగతిని సమీక్షించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా శాఖలకు సూచించారు.
సచివాలయంలో గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పురోగతిపై సీఎస్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఇప్పటివరకు 12 శాఖల నుంచి కేవలం 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలు మాత్రమే తమకు అందాయని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు నివేదించారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేయగా, ఇప్పటివరకు అందులో నాలుగో వంతు ప్రతిపాదనలు కూడా ఎందుకు రాలేదని సీఎస్ ముఖ్య కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరిలోనే స్పష్టమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వకపోవటంపట్ల అసహనం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్యాశాఖల పరిధిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, కానీ వీరిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల అడ్డంకులున్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
వీటన్నింటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించాల్సిన అవసరముందని, అందుకే ఆలస్యమవుతోందని గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలా.. లేదా అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మార్గదర్శకాలకు భిన్నమైన సమస్యలు, ప్రత్యేకమైన కేసులేమైనా ఉంటే, వాటిని ప్రత్యేకంగానే పరిగణించాలని సీఎస్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. క్రమబద్ధీకరణ పురోగతిని వారం రోజులకోసారి సమీక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు.
18న కాంట్రాక్టు ఉద్యోగుల భేటీ
మరోవైపు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత జాప్యం చేస్తుండటంపట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో సమావేశమై కార్యాచరణ రూపొం దించేందుకు సిద్ధమవుతున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు.