cudapa
-
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
ఎన్ఆర్సీకి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు. -
వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై అక్రమ కేసులు
కడప అర్బన్: జిల్లాలో ఫారం–7 పేరుతో తమ పార్టీకి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, ఎస్. రఘురామిరెడి, పార్టీ నాయకులు గురువారం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కలిశారు. తమ బూత్ కన్వీనర్లను వేధింపులకు గురిచేస్తున్న వైనాలను వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడప పరిధిలో లక్షా 28వేల ఓట్లు అక్రమంగా తొలగించారన్నారు. వాటిలో దాదాపు 77వేల ఓట్లు రెన్యూవల్‌చేయడంలో వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ కన్వీనర్లే కీలకపాత్ర పోషించారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎలాంటి భయాలకు లోనుకావాల్సిన అవసరంలేదని బూత్ కన్వీనర్లకు ఆయన భరోసా ఇచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో కేసుల్లో వున్న వారిని మాత్రమే బైండోవర్ చేయాలని.. అనవసరంగా ఎవరిపైనా బైండోవర్లు చేసి, ఇబ్బందులకు గురి చేయవద్దనీ ఎస్పీని కోరామన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ కేసుల విషయంలో ఎన్నికల కమిషన్ సిఫారసులను అనుసరిస్తామని ఎస్పీహామీ ఇచ్చారన్నారు, క్షణ్ణంగా విచారించి చర్యలు చేపడతామన్నారన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో బూత్ కమిటీ కన్వీనర్లపై కేసులు బనాయించడం సరికాదనీ కడప ఎమ్మెల్యే అంజద్‌బాష ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో 2లక్షల 56వేల ఓట్లు వుండగా, లక్షా 64 వేల ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు. వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ కన్వీనర్లు చొరవ తీసుకుని, ఓట్ల సంఖ్యను పెంచేలా ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారు చేయలేని పనిని తమ పార్టీ స్వచ్చందంగా నిర్వహించిదన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు అధికార పార్టీ అండదండలతో ఫారం–7 పేరిట దొంగ దరఖాస్తులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు భరత్‌రెడ్డి, షఫీవుల్లా, యానాదయ్యలు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్తో వాయిస్ కాల్స్ మళ్లింపు
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ మళ్లిస్తూ ప్రభుత్వ బొక్కసానికి చిల్లుపెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హాజీ గఫూర్‌సాబ్ వీధిలో ఉంటున్న హిమాయతుల్లా షరీఫ్ కుమారుడు షేక్ ముక్కపాలెం హఫీజుల్లా ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. సమాచారం అందుకున్న కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా విలువజేసే మూడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీఓఐపీ) వస్తువులు, 120 ఒడాఫోన్, రిలయన్స్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తే అది కంప్యూటర్ ద్వారా దేశంలోని అనధికారిక ఎక్స్ఛేంజిలకు వస్తుందని, అక్కడినుంచి సాధారణ కాల్స్ మాదిరి మారుతాయని ఆయన వివరించారు. ఆ కాల్స్‌ను నిందితుడు తనకు తెలిసిన సాంకేతికత, ఆధునిక పరికరాలతో సాధారణ కాల్స్ మాదిరి మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడని డీఎస్పీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఇతర సెల్‌ఫోన్ సంస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడన్నారు. హఫీజుల్లాకుతోడు విజయవాడలో చిరంజీవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ కాల్స్ మళ్లించడంలో నైపుణ్యం పొందాడన్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ ఎస్ఐలు యోగేంద్ర, మోహన్, ఎస్బీ ఎస్ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కంటతడిపెట్టిన లక్ష్మీదేవమ్మ
విజయవాడ:'తెలుగుదేశం పార్టీ కోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. రాజకీయ పోరాటంతో నా భర్తను కూడా కోల్పోయాను. మమ్మల్ని అన్నిరకాలుగా ఇబ్బందులపాలు చేసినవారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయం?' అంటూ సీఎం చంద్రబాబు సమక్షంలో కంటతడిపెట్టారు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేరికపై జమ్మలమడుగు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సోమవారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై లక్ష్మీదేవమ్మ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమ పార్టీలో చేరతారని మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు చెప్పారు. అయితే ఆదినారాయణ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, ఆయన పార్టీలో చేరితే తనదారి తాను చూసుకుంటానన్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జి.. చంద్రబాబుతో సమావేశం అనంతరం కాస్త మెత్తబడ్డారు. అధినేతనే నమ్ముకుని బతుకుతున్నానని, ఆయనను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడబోనని స్పష్టంచేశారు. కాగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, సమన్వయం ముందుకుసాగేలా చూస్తానని సీఎం చంద్రబాబు లక్ష్మీదేవమ్మ, రామసుబ్బారెడ్డిలకు సర్దిచెప్పినట్లు తెలిసింది.