
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్‌ఆర్‌సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్‌ఆర్‌సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు.