Current meter
-
మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపింది
మెదక్‌జోన్: వ్యవసా య బోరు బావులకు మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల దృష్టి కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మెదక్ కలెక్టరేట్లో గురువారం జరిగిన జెడ్పీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించి సీఎం కేసీఆర్ రూ.30 వేల కోట్లు పోయినా సరే వ్యవ సాయ బావులకు మీటర్లు పెట్టలేదన్నారు. కేంద్రం విద్యుత్ శాఖను కూడా ప్రైవేట్ పరం చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రాలు లక్షల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసుకున్న విద్యుత్ శాఖను కేంద్రం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే విధంగా దొడ్డిదారిన నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడ్డారు. -
19 ఏళ్ల క్రితంనాటి బిల్లు కట్టాల్సిందే!
యాదగిరిగుట్ట: వారు 19 ఏళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. పాత యజమాని పేరిట ఉన్న విద్యుత్ మీటర్ తొలగించి కొత్త మీటర్ బిగించుకున్నారు. అప్పటి నుంచి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే, పాత యజమాని పేరిట ఉన్న రూ.10 వేల బకాయి కట్టాలంటూ ఇప్పుడు విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లు చెల్లించలేదని తాజాగా కరెంటు కనెక్షన్ కూడా తొలగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... 19 ఏళ్ల క్రితం దాతారుపల్లిలో జయిని నాగరాజుకు చెందిన ఇంటిని రాంపల్లి సక్కుబాయి కొనుగోలు చేశారు. అప్పట్లోనే పాత విద్యుత్ మీటర్ తొలగించి, సక్కుబాయి కుటుంబసభ్యుల పేరుతో కొత్త మీటర్ తీసుకున్నారు. అప్పటి నుంచి కరెంట్ బిల్లు రూ.500 కంటే తక్కువగానే వస్తోంది. కానీ, గత నెలలో విద్యుత్ అధికారులు వచ్చి గతంలో ఉన్న ఈ ఇంటి యజమాని పేరుతో బకాయి బిల్లు రూ.10 వేలు వచ్చింది, ఆ బిల్లు ఇప్పుడు కట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే గత నెల బిల్లు సక్కుబాయి కుటుంబసభ్యులు కట్టలేదు. దీంతో గురువారం విద్యుత్ అధికారులు దాతారుపల్లిలోని సక్కుబాయి ఇంటికి వెళ్లి ఈ నెల ఇంటి బిల్లుతోపాటు బకాయి ఉన్న బిల్లు కట్టాలని, లేకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ కనెక్షన్ తొలగించారు. ఇదెక్కడి అన్యాయం.. తాము ఇల్లు కొనుగోలు చేసి 19 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాత బకాయి ఉందని విద్యుత్ అధికారులు చెప్పలేదని సక్కుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇప్పుడు ఈ విధంగా విద్యుత్ కనెక్షన్ తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
రీచార్జి అయిపోతే కరెంట్ కట్
సాక్షి, కొందుర్గు(రంగారెడ్డి): విద్యుత్ చౌర్యానికి చెక్ పెట్టడంతోపాటు, పేరుకుపోతున్న పెండింగ్ బకాయిల నుంచి బయటపడేందకు డిస్కంలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చి వాటిలో సెల్ఫోన్లో సిమ్ అమర్చిన విధంగా సిమ్ ఏర్పాటుచేసి దానికో నంబర్ కేటాయించనుంది. సంబంధిత నంబర్‌కు ముందుగా రీచార్జి చేసుకుంటేనే నిర్ణీత వ్యవధి వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని కొందుర్గు ట్రాన్స్‌కో ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రీచార్జి కాలం ముగిసిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, తిరిగి రీచార్జి చేసుకుంటేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని తెలిపారు. ముందుగా 500 యూనిట్లు, ఆపై వినియోగదారులకు.. కేంద్ర ప్రభుత్వం 15శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం, డిస్కమ్ సంస్థ 75 శాతం నిధులతో ముందుగా గ్రామాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఆన్ఆఫ్ సిస్టమ్ తదితర అన్ని సమస్యలను పరిష్కరించనుంది. ఈ పనులన్నీ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వస్తుంది. ముందుగా నెలకు 500, ఆపై యూనిట్ల విద్యుత్ వినియోగించే వినియోగదారులకు సంబంధించిన మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చడం జరుగుతుంది. అనంతరం విడతల వారీగా అందరు వినియోగదారులకు మీటర్లు అమర్చనున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ ద్వారా డిస్కమ్‌కు చేరుతాయి. అనుకోకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఒకగంట పాటు లోను అందజేసి విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. తదుపరి రీచార్జి చేసుకున్న తేదీ నుంచి లోను తీసుకున్న మొత్తం కట్‌చేయబడుతుంది. వినియోగదారులు విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్‌ను లింక్ చేసుకోచ్చు. జిల్లాలో వెయ్యికి పైనే డిజిటల్ మీటర్ల బిగింపు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక వెయ్యి డిజిటల్ మీటర్లకు పైనే బిగించడం జరిగింది. ఇందులో భాగంగా కొందుర్గు మండలంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, చౌదరిగూడ తహసీల్దార్ కార్యాలయంతోపాటు పలు గ్రామాల్లోని పాఠశాలలకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చారు. త్వరలో జిల్లాలోని అన్నిచోట్ల ప్రీపెయిడ్ మీటర్లు బింగించేందుకు డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. – వినయ్‌కుమార్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ, కొందుర్గు -
వాటే మీటర్స్ యార్!
అప్పట్లో ప్రతి ఇంటికి ఉంటేగింటేకరెంటు మీటర్ అనేదొక్కటే ఉండేది.అది కూడా ముక్కీ మూలిగీ నడిచేది. పొరుగింటి వాళ్ల కంటే ఒకవేళ మన ఇంటి కరెంటు మీటరు గబగబా తిరుగుతుందనుకోండి. అలా తిరగడంలో అది అతిచురుగ్గా ఉందనుకోండి. అప్పుడు దాని దూకుడు చూసి మనం ఏడ్చి చచ్చేవాళ్లం. దీనికిదేం పోయే కాలం వచ్చిందో.. అలా వేగంగా తిరిగి చస్తోందని ఆడిపోసుకునేవాళ్లం. కానీ ఆ స్వర్ణయుగం కాస్తా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడంతా కాలమంతా టెక్నాలజీదే. మీరొక మాడ్రన్ వాచీలాంటిది పెట్టుకున్నారనుకోండి. అదెన్నో విషయాలు చెబుతుంటుంది. ఇవ్వాళ మీరెన్ని క్యాలరీలు తిన్నారు? తిన్నదరిగి చావాలంటే.. నడిస్తే ఎన్ని అడుగులు వేయాలి? ఒకవేళ గెంతితే ఎన్ని గెంతులు? పరుగెత్తితే ఎన్ని అంగలు?ఇలా నడకోమీటరూ, పరుగోమీటరూ, గెంతోమీటరు.. అన్నీ మీ వాచీలోనే ఉంటాయి. అన్నట్టు.. అది మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోందో కూడా చెబుతుంది. రాత్రి మీకెంత నిద్ర పట్టిందీ.. ఒకవేళ ఆ నిద్రలో ఏమైనా కొరత ఏర్పడితే ఇవ్వాళ ఎన్ని గంటలు నిద్రపోవాలి లాంటి విషయాలన్నీ చెప్పేసి, వాటిని అక్షరాలా అమలు జరిపే మెకానికల్ డివైజ్‌ల కాలం వచ్చేసింది. పైగా ఇప్పుడు ఆరోగ్యస్పృహ విపరీతంగా పెరిగిపోవడంతో చేతికి వేసుకునే ఆ మోడ్రన్ బ్యాండ్ లాంటి గడియారాలకు తెగ గిరాకీ పెరిగిపోయింది. అందరూ తలో వాచీ పెట్టేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మా రాంబాబుగాడు ఈ ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించడం నేను గమనించాను. ‘‘అయినా నీకింత మెకానికాలిటీ నచ్చదు కదరా. మరి ఎందుకీ గాడ్జెట్లను ఇంతగా పరిశీలిస్తున్నావ్?’’ ఉండబట్టలేక అడిగా. ‘‘ఈ తరహాలోనే మనం గనక కొన్ని కొత్త కొత్త గాడ్జెట్లు కనిపెట్టామనుకోరా. అప్పుడు వాటికి తెగ గిరాకీ ఉంటుంది. మనం కనిపెట్టిన వాటిని ఒక్క పార్టీ కొనేసినా చాలు.. మనం కోటీశ్వరులమైపోవడం గ్యారెంటీ’’ అన్నాడు వాడు. ‘‘వీటిల్లోంచి కొత్తగా ఏం కనిపెడతావ్రా నువ్వు?’’ ‘‘సపోజ్... ఫర్సపోజ్.. అచ్చం సెల్‌ఫోన్‌లాగే ఉండేలా మనం ‘అభిప్రాయోమీటర్’ అనేది కనిపెడదాం. అప్పుడు దాన్ని ఆపరేట్ చేయగానే ఎదుటివాడు ఏ పార్టీని అభిమానిస్తున్నాడు, వచ్చే ఎన్నికల్లో వాడు ఎవరిని సమర్థిస్తాడనే వాడి అభిప్రాయాలు మనకు తెలిసిపోతాయన్నమాట’’ చెప్పాడు రాంబాబు గాడు. ‘‘ఒరేయ్ నీ బుర్ర సామాన్యం కాదురా’’ అంటూ కితాబిచ్చేలోపే మళ్లీ చెలరేగిపోయాడు వాడు. ‘‘అప్పుడే పొగడకు. ఇదేగాక మళ్లీ ఇంకో డివైజ్ కూడా డెవలప్ చేస్తాం. దానిపేరే చేంజోమీటర్. ఇది వాడగానే ఎదుటాడి అభిప్రాయం టక్కున మారిపోతుంది. వాడు కాస్తా ఇలా మన వైపునకు వచ్చేస్తాడు. మనకే ఓటేసేస్తాడు. ఇక చూడ్రా. సింపుల్‌గా ఇలాంటి రెండు పరికరాలను తయారు చేస్తే చాలు. ఇక్కడ మన రాష్ట్రాల్లోనూ, మన దేశంలోని పార్టీలే కాదు.. అమెరికాలోని రిపబ్లికన్లూ, డెమోక్రాట్లు మొదలుకుని ప్రపంచంలోని అందరూ మన గాడ్జెట్లే కొనుక్కుంటార్రా. అప్పుడు మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. మొదట.. వాడు చెప్పిందేదో బాగానే ఉన్నట్టు అనిపించిందిగానీ, ఆలోచించగా ఆలోచించగా ఇక్కడేదో తిరకాసున్నట్టు నాకు అనిపించింది. ‘‘అవున్రా.. అంతా బాగానే ఉందిగానీ ఇక్కడో సమస్య ఉంది. ఈ మీటర్లనీ ఏదో ఒక్క పార్టీ దగ్గరే ఉంటే వీటితో ప్రయోజనం గానీ.. మన పార్టీ దగ్గరా ఇవే ఉండి, మళ్లీ ఎదుటాడిదగ్గరా ఇవే ఉంటే.. అప్పుడందరూ వాటిని ఎదుటాడిమీద యధేచ్ఛగా ప్రయోగిస్తూ ఉంటే ప్రయోజనమేముంటుందిరా. మళ్లీ అంతా నార్మల్‌గానే నలిఫై అయిపోతుంది కదా?!.. అంటే ఒకదాన్నొకటి రద్దు చేసేసుకుంటాయి కదా’’ ‘‘ఛీ నువ్వో అపశకున పక్షివి. ఆలోచనల్లో కూడా అనుక్షణం అడ్డుపడటమే. కనీసం కాన్సెప్టులను కూడా డెవలప్ కానివ్వవు. కొనేవాడు కొంటాడు... లేకపోతే లేదు. ఈ లాజిక్‌లన్నీ నీకెందుకోయ్ ’’ అంటూ నన్నాడిపోసుకున్నాడు వాడు. –యాసీన్ -
900/8000
ఇవి విద్యుత్‌శాఖకు లబ్ధిదారులు ఇచ్చిన మార్కులు. కరెంటోళ్లకు వీరు మార్కులివ్వడమేంటి? ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలిగానీ అని అనుకుంటున్నారా? అవును మరి. విద్యుత్ మీటర్ల కోసం ఏడాది క్రితం 8 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా 900 అమర్చారు. అందుకే ఈ మార్కులిచ్చారు. అశ్వాపురం : ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం(డీడీయూజీజేవై) జిల్లాలో నత్తనకడన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ తీసుకోలేక, చీకట్లో మగ్గుతున్న నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్‌కార్డు కలిగిన పేదలు తమకు విద్యుత్ కనెక్షన్ లేదని పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణపత్రంతో విద్యుత్ శాఖ అధికారులకు రూ.125 డీడీ సమర్పించాలి. వారు సర్వీస్‌వైరు, రెండు ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ మీటరును అమరుస్తారు. ఇంటికి సమీపంలో స్తంభాలు లేకపోతే కొత్తగా వేస్తారు. గతంలో విద్యుత్ మీటర్లకు డీడీలు చెల్లిస్తే సర్వీస్‌వైరు, ఇతర ఖర్చులు యజమానే భరించేవాడు. ఈ పథకంలో ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అర్హులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 8 వేల దరఖాస్తులొస్తే 900 మీటర్లు అమర్చారు డీడీయూజీజేవై పథకం కింద జిల్లాలో 8 వేల మంది విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 2017లో ఈ పథకం ప్రారంభమైంది. ఏడాది గడుస్తున్నా 900 మందికి మించి విద్యుత్ మీటర్లు అందివ్వలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, మీటర్లు, సర్వీస్‌వైరు సామగ్రి అందుబాటులో లేకపోవడంతో పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సర కాలంగా ఇబ్బందులు విద్యుత్ మీటర్ల కోసం నిరుపేదలు గత మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏడా దికాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇవ్వలేదు. దీంతో చీకట్లోనే మగ్గుతున్నారు. కొందరు డీడీలు కట్టామని అనధికాకరికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. తనిఖీలకు వచ్చిన విద్యు త్ విజిలెన్స్ అధికారులేమో విద్యుత్ చౌర్యమంటూ జరిమానాలు విధిస్తున్నారు. కే సులు నమోదు చేస్తున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో విద్యుత్ మీటర్లు అమర్చాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మార్చిలోగా పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీ ణ విద్యుదీకరణ యోజన పథకానికి జిల్లా లో 8 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 900 మీటర్లు అమర్చాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఆలస్యమయింది. ఇటీవల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో మీటర్లు అమర్చే ప్రక్రియ వేగవంతం చేస్తాం. మార్చి నెలలోపు దరఖాస్తుదారులందరికి మీటర్లు అమరుస్తాం. –ఏ.సురేందర్, ఎస్ఈ, టీఎస్ ఎన్పీడీసీఎల్, కొత్తగూడెం -
వెలగని దీన్‌దయాల్
నెన్నెల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్ దయాల్ యోజన పథకం ప్రచార ఆర్భాటంగానే మిగులుతోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. నిరుపేదలకు రూ.125కే మీటర్ అందించి విద్యుత్ సౌకర్యం కలిగించడం దీని ఉద్దేశ్యం. కానీ పథకంపై అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో దరఖాస్తులు చేసుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క కనెక్షన్ కూడా అందించకపోవడం గమనార్హం. నెన్నెల మండలంలో 15 వేల జనాభా ఉంది. వారిలో దారిద్య్ర రేఖకు దిగువన సుమారు 40 శాతానికిపైగా ఉన్నారు. ఇంకా విద్యుత్ వెలుగులు నోచుకోని పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీనదయాల్ యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఆధార్‌కార్డు జిరాక్సుతో పాటు రూ.125 చెల్లిస్తే విద్యుత్ మీటర్ అందజేయాల్సి ఉంది. విద్యుత్ బోర్డు, బల్బ్ ఏర్పాటుకు హోల్డర్, ఎల్ఈడీ బల్బు, అవసరమైన చోట విద్యుత్ స్తంభం, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రచారం చేయడంతో నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 1066 దరఖాస్తులు వచ్చాయి. ఎదురుచూపుల్లోనే పేదలు... పథకం కింద దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఒక్క కనెక్షన్ కూడా అందించింది లేదు. అక్కడక్కడ విద్యుత్ శాఖ వారు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ కనెక్షన్లు, కొత్త మీటర్ల ఊసెత్తడం లేదు. పథకంపై ఎటూ తేల్చకపోవడంతో దరఖాస్తుదార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్తంభాలు ఏర్పాటు చేయడం పూర్తయ్యాక విద్యుత్ మీటర్లు అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు గతంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని నిరుపేదలు పేర్కొంటున్నారు. పైసలు కట్టించుకున్నరు కరెంట్ లేకపోవడంతో చీకట్లో పిల్లా, పాపలతో ఉంటున్నాం. అక్రమంగా కరెంట్ వేసుకుంటే కేసులు పెడతామని భయపెట్టారు. మాతో రూ.125 మీటర్ అని పైసలు కట్టించుకున్నారు. ఇంత వరకు మీటర్ జాడ లేదు. – అమర్, నెన్నెల త్వరలోనే అందజేస్తాం దీన్ దయాల్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తాం. విద్యుత్ మీటర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించాం. ప్రస్తుతం స్తంభాలు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యాక మీటర్లను ఏర్పాటు చేస్తాం. – సదానందం, ట్రాన్స్‌కో ఏఈ(నెన్నెల) -
డిజిటల్ దోపిడీ
⇒ కరెంట్ మీటర్ల ఏర్పాటులో వసూళ్ల పర్వం ⇒ మీటర్ల బిగింపును ఏజెన్సీకి అప్పగించిన ఎన్పీడీసీఎల్ ఖమ్మం: డిజిటల్ మీటర్ల ఏర్పాటులో ఏజెన్సీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.200 వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖలో ముడుపులు ముట్టజెప్పనిదే పని జరగదనడానికి ఈ వ్యవహారం నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్కానింగ్ ద్వారా రీడింగ్‌ను తీసుకునే డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్పీడీసీఎల్ నగదు ఇచ్చినా, సదరు సిబ్బంది వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల ద్వారా రీడింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ గుర్తించింది. ఈ మీటర్లనుంచి విద్యుత్ విని యోగం రీడింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ విద్యుత్ వాడినప్పటికీ.. తక్కువ రీడింగ్ చూప డం.. మరికొన్ని చోట్ల తక్కువ రీడింగ్ చూపి నా.. ఎక్కువ బిల్లులు రావడం తదితర ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. ఏసీ,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న వారు.. ఎక్కువ బిల్లు వచ్చిన నెలలో ప్రైవేట్ ఆపరేటర్‌తో మా ట్లాడుకుని బిల్లు తక్కువ వచ్చేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటువంటి అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ కొత్తగా డిజిటల్ మీటర్లను అమర్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఖమ్మం సర్కిల్ పరిధిలోని రెండు జిల్లాలో డిజిటల్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కో మీటర్ ఏర్పాటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ మీటరు విద్యుత్ బిల్లులు సక్రమంగా వచ్చేందుకు ప్రస్తు తం ఖమ్మం సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఐఆర్డీఏ డిజిటల్ మీటర్లను అమరుస్తున్నారు. మొత్తం 6,61,737 డిజిటల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. ఈ పనిని కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వీరు ప్రస్తుతం డిజిటల్ మీటర్లను అమర్చే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 3,17,737 డిజిటల్ మీటర్లను అమర్చారు. మరో 3.44లక్షల డిజి టల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. మీటర్ల ఏర్పాటులో చేతివాటం ప్రతి ఇంటిలో డిజిటల్ మీటర్‌ను అమర్చే పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మీటర్‌ను అమర్చిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి డిమాండ్ చేసి మరీ రూ.200 వసూలు చేస్తుండటంతో విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు తామెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ప్రైవేట్ ఏజెన్సీల వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. వారు మాత్రం తాము పని చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబు తూ వసూలు చేస్తున్నారు. ఈవిషయంపై ఖమ్మం సర్కిల్ ఎస్ఈ రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, వీరు ఉచితంగానే డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా మీటర్ అమరిస్తే డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు. -
విజిలెన్స్ అధికారుల దాడులు
- విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు, రిమాండు - దితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు మొయినాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరిపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు ఉండటం గమనార్హం. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎనికేపల్లి ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్ కొన్నేళ్లుగా తన ఇంటికి కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. గతంలోనూ ఆయనపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అదే విధంగా అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన తూర్పు కృష్ణారెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద పశువుల షెడ్‌కు కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఇతనిపైనా గతంలో కేసులు నమోదయ్యాయి. అయినా వీరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూనే ఉన్నారు. బుధవారం విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు, విజిలెన్స్ ఏఈ బి.బలరాం, మండల విద్యుత్ ఏఈ నాగరాజులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఎనికేపల్లిలో ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్, అజీజ్‌నగర్‌లో తూర్పు కృష్ణారెడ్డిలు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు తెలిపారు.