ఇవి విద్యుత్‌శాఖకు లబ్ధిదారులు ఇచ్చిన మార్కులు. కరెంటోళ్లకు వీరు మార్కులివ్వడమేంటి? ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలిగానీ అని అనుకుంటున్నారా? అవును మరి. విద్యుత్ మీటర్ల కోసం ఏడాది క్రితం 8 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా 900 అమర్చారు. అందుకే ఈ మార్కులిచ్చారు.
అశ్వాపురం : ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం(డీడీయూజీజేవై) జిల్లాలో నత్తనకడన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ తీసుకోలేక, చీకట్లో మగ్గుతున్న నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్‌కార్డు కలిగిన పేదలు తమకు విద్యుత్ కనెక్షన్ లేదని పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణపత్రంతో విద్యుత్ శాఖ అధికారులకు రూ.125 డీడీ సమర్పించాలి. వారు సర్వీస్‌వైరు, రెండు ఎల్‌ఈడీ బల్బులతో విద్యుత్ మీటరును అమరుస్తారు. ఇంటికి సమీపంలో స్తంభాలు లేకపోతే కొత్తగా వేస్తారు. గతంలో విద్యుత్ మీటర్లకు డీడీలు చెల్లిస్తే సర్వీస్‌వైరు, ఇతర ఖర్చులు యజమానే భరించేవాడు. ఈ పథకంలో ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అర్హులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
8 వేల దరఖాస్తులొస్తే 900 మీటర్లు అమర్చారు
డీడీయూజీజేవై పథకం కింద జిల్లాలో 8 వేల మంది విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 2017లో ఈ పథకం ప్రారంభమైంది. ఏడాది గడుస్తున్నా 900 మందికి మించి విద్యుత్ మీటర్లు అందివ్వలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, మీటర్లు, సర్వీస్‌వైరు సామగ్రి అందుబాటులో లేకపోవడంతో పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
సంవత్సర కాలంగా ఇబ్బందులు
విద్యుత్ మీటర్ల కోసం నిరుపేదలు గత మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏడా దికాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇవ్వలేదు. దీంతో చీకట్లోనే మగ్గుతున్నారు. కొందరు డీడీలు కట్టామని అనధికాకరికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. తనిఖీలకు వచ్చిన విద్యు త్ విజిలెన్స్ అధికారులేమో విద్యుత్ చౌర్యమంటూ జరిమానాలు విధిస్తున్నారు. కే సులు నమోదు చేస్తున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో విద్యుత్ మీటర్లు అమర్చాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
మార్చిలోగా పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీ ణ విద్యుదీకరణ యోజన పథకానికి జిల్లా లో 8 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 900 మీటర్లు అమర్చాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఆలస్యమయింది. ఇటీవల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో మీటర్లు అమర్చే ప్రక్రియ వేగవంతం చేస్తాం. మార్చి నెలలోపు దరఖాస్తుదారులందరికి మీటర్లు అమరుస్తాం.
–ఏ.సురేందర్, ఎస్‌ఈ, టీఎస్ ఎన్‌పీడీసీఎల్, కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment