Cut Chesthe
-
కట్ చేస్తే!
-
ఆద్యంతం ఉత్కంఠభరితం
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క, విజయ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎమ్.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠకు లోనుచేసే సినిమా ఇది. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు’’ అన్నారు. సినిమా అంటే ఇష్టంతో ఈ రంగంలోకొచ్చానని, తన మనసుకు ఎంతో నచ్చిన కథాంశమిదని నిర్మాత తెలిపారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశమిదని నటుడు విజయ్ చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి. -
భయంతో వినోదం
హారర్ నేపథ్యంతో కూడా బ్రహ్మాండమైన కామెడీ పుట్టించొచ్చునని ఇటీవలి కాలంలో ‘ప్రేమకథా చిత్రం’ నిరూపించింది. అదే రీతిలో హారర్ ఎంటర్టైనర్గా ‘కట్ చేస్తే’ చిత్రం రూపొందింది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదని దర్శకుడు పడాల శివసుబ్రహ్మణ్యం నమ్మకంగా చెబుతున్నారు. సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎస్.కుమార్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల రెండోవారంలో విడుదల కానుంది. పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ సినిమా అన్ని వర్గాలకూ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: శ్రీమతి సంజీవరాణి. -
కట్ చేస్తే పాటలు
సంజయ్, తనిష్క, విజయ్, జీవిత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కట్ చేస్తే’. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. డా.పూర్ణచంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిల్ సుంకర ఆడియో సీడీని ఆవిష్కరించి, ప్రభుత్వ విప్ అనిల్ అందించారు. వీరితో పాటు టి.ప్రసన్నకుమార్, రోషం బాలు, వల్లభనేని వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. హారర్ నేపథ్యంలో సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. సాహసం చేసి ఈ చిత్రాన్ని నిర్మించానని, సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ మాట్లాడారు. -
కట్ చేస్తే భయమేస్తుంది
సంజయ్, తనిష్క జంటగా రూపొందుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. రచయిత పడాల శివసుబ్రమణ్యం ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్కంఠను రేకెత్తించే హారర్ చిత్రమిది. బెంగళూరులోని జోగ్ ఫాల్స్‌లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయింది. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాం. నిర్మాణానంతర కార్యక్ర మాలు శరవే గంగా జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నలుగురు విద్యార్థులు బ్లాక్ మ్యాజిక్ పవర్ కోసం ప్రయత్నించే ఓ ప్రొఫెసర్ బారి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారనేది ఈ సినిమా మెయిన్ థీమ్ అని దర్శకుడు చెప్పారు. రంగనాథ్, జయప్రకాష్‌రెడ్డి, జీవా, కృష్ణభగవాన్, చిట్టిబాబు, దువ్వాసి మోహన్, విజయ్, సుభాష్, దొంగల ప్రసాద్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్. -
శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే'
మాటల రచయిత శివసుబ్రమణ్యం దర్శకునిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, హారర్ మేళవించిన యువతరం చిత్రమిది. హీరో, హీరో మిత్రబృందం నేపథ్యంలో ఫైట్ మాస్టర్ నందు ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. భారీ ఛేజింగ్‌లతో ఈ పోరాటం సాగుతుంది. యూనిట్ అద్భుతంగా సహకరిస్తున్నారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వస్తోంది. 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇలాంటి భిన్నమైన కథాంశంతో ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను’’అని చెప్పారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పాట, పాపి కొండల నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నామని నిర్మాత తెలిపారు.