CyberMedia Research
-
ఆ మార్కెట్లోనూ జియోదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఓ వైపు టెల్కోలకు చుక్కులు చూపిస్తుండగా... ఇటు అదే సంస్థకు చెందిన వైఫై రూటర్ జియోఫై కూడా మార్కెట్లో దూసుకుపోతుంది. డేటా కార్డు మార్కెట్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నట్టు సైబర్ మీడియా రీసెర్చ్( సీఎంఆర్) వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న హువాయ్ కేవలం 3 శాతం మార్కెట్ షేరు మాత్రమే కలిగిఉందని సీఎంఆర్ చెప్పింది. జనవరి-మార్చి క్వార్టర్లో డేటా కార్డుల షిప్మెంట్లు 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లు ఎగిసి 16 శాతం వృద్ధిని నమోదుచేశాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది డేటా కార్డు మార్కెట్ ఏడింతలు విస్తరించినట్టు కూడా పేర్కొంది. ఈ క్రమంలో జియో అందిస్తున్న ఉచిత డేటా సర్వీసులు, మి-ఫై డేటా కార్డులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొబైల్ హాట్స్పాట్లు దీని పాపులారిటీని పెంచుతున్నాయని సీఎంఆర్ తెలిపింది. జియో ఫై రూటర్ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు ఇటీవలే రూ.1,999 విలువైన డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ను రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి-మార్చి క్వార్టర్లో కూడా దీని షేరు 90 శాతముంది. జియో ఫై డివైజ్‌లు ఇటు హోమ్ రూటర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లో జియో డేటా సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. -
పెరిగిన దేశీ తయారీ స్మార్ట్ఫోన్ల ఎగుమతులు
బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 19.9 శాతంగా ఉన్న స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రెండో త్రైమాసికంలో 24.8 శాతానికి పెరిగాయి. అంటే మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో 24.8 శాతం ఇండియాలో తయారైనవి లేదా అసెంబుల్ అయినవి వున్నాయి. సైబర్‌మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శాంసంగ్, స్పైస్ కంపెనీలకు ఇప్పటికే దేశంలో ప్లాంట్లు ఉన్నాయి. హెచ్‌టీసీ, జియోనీ వంటి కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. -
20 ఏళ్ల తర్వాత తగ్గిన ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ మొబైల్ ఫోన్ అమ్మకాలు తగ్గాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో మొబైల్ ఫోన్ అమ్మకాలు 14.5 శాతం తగ్గాయని సైబర్ మీడియా రీసెర్చ్ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. గతేడాది చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 6.2 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవగా, ఈ ఏడాది క్వార్టర్ లో 5.3 కోట్ల ఫోన్లు సేల్ అయ్యాయి. స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కూడా 7.4 శాతం పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో తక్కువ ధర కలిగిన ఫీచర్ ఫోన్ అమ్మకాలు 18.3 శాతం క్షీణించాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మందగించడం తయారీదార్లను కలవరపెడుతోంది. -
టాప్‌లేపుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 219 శాతం వృద్ధితో 1.45 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, సైబర్ మీడియా రీసెర్చ్ మంగళవారం తెలిపింది. వీటిల్లో 68 శాతం 3జీ ఎనేబుల్ ఫోన్లేనని అంటున్న ఈ సంస్థ స్మార్ట్ఫోన్ల విక్రయాలపై వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...., గత ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 66 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు 1.42 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొత్తం 5.89 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి, మూడు నెలల ప్రాతిపదికన చూస్తే 16 శాతం క్షీణత నమోదైంది. కాగా గత ఏడాది ఇదే కాలానికి మొత్తం 7.04 కోట్ల మొబైళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జనవరి-మార్చి కాలానికి 4.75 కోట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 7 శాతం క్షీణించి 4.44 కోట్లకు తగ్గాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ విక్రయాలు(5.62 కోట్లు)తో పోల్చితే 21 శాతం తగ్గాయి. వివిధ రకాల పనులను చేసుకోవడానికి మొబైల్స్ ఉపయోగించుకోవడం పెరుగుతుంది. డేటా సర్వీసులకు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 43% వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18%), కార్బన్ (5%)లు నిలిచాయి. మొత్తం ఫోన్ల మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా, శామ్‌సంగ్‌దే (20% మార్కెట్ వాటా)అగ్రస్థానం, ఆ తర్వాతి స్థానాల్లో నోకియా(18%, మైక్రోమ్యాక్స్(11 శాతం)లు నిలిచాయి. -
టాబ్లెట్స్ పై పెరుగుతున్న యువత మోజు: సర్వే
డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదని అని సైబర్ మీడియా రీసర్చ్ ఇండియా వెల్లడించింది. మార్కెట్ లోకి ఎన్నో మొబైల్ కంప్యూటర్ వచ్చినా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల ప్రాముఖ్యత తగ్గలేదని సర్వేలో వెల్లడైంది. ఇటీవల 'టాబ్లెట్స్ యూసేజ్ అండ్ ఆడాప్షన్ ట్రెండ్స్ 2013' అనే అంశంపై సైబర్ మీడియా రీసెర్స్ ఇండియా 20 భారతీయ నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అత్యధికంగా వినియోగదారులు టాబ్లెట్స్ కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, వినోదాత్మక సమాచారాన్ని పొందేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట తీసుకు వెళ్లడానికి టాబ్లెట్స్ సౌకర్యంగా ఉన్నాయని సీఎంఆర్ సర్వేలో వెల్లడైంది. అయితే 78 శాతం మంది టాబ్లెట్స్ కన్నా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లనే యువత ఇష్టపడుతున్నారని సర్వే సమాచారం. సెప్టెంబర్-నవంబర్ 2013లో మొత్తం 3600 మందిలో 13 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు టాబ్లెట్ వినియోగదారులు 2400, వినియోగించని వారిని 1200 మందిని ఎంచుకుని సర్వే నిర్వహించారు. ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ కు 87 శాతం మొగ్గు చూపగా, 10 శాతం మంది ఆపిల్ ఐపాడ్ ను వినియోగానికి యువత ఇష్టపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. టాబ్లెట్స్ వినియోగించని వారు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా చాటింగ్, మెసెజ్, ఈమెయిల్ వినియోగానికే టాబ్లెట్స్ వినియోగిస్తున్నారని సీఎంఆర్ ఇండియా తెలిపింది.