Cyclone Amphan
-
తుపానుపై మోదీ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ : అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’పై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఆంఫన్ తుపానుపై ఎలా సంసిద్ధమవ్వాలనేదానిపై సమీక్షించాము. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై చర్చించాము. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’ ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారానికి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. అంఫన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ నెల 20 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర వెంబడి 50 కి.మీలు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. (చదవండి : అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’) -
అలర్ట్: పెను తుపానుగా ‘అంఫన్’
సాక్షి, చెన్నై : తమిళనాడుపై అంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూర్, క్రిష్ణగిరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలకు పడుతున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డ. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్లలో మూడో ప్రమాద హెచ్చరిక సూచి ఎగుర వేశారు. రామేశ్వరం నుంచి చెన్నై ఎన్నూర్ హార్బర్ వరకు ఈ హెచ్చరిక జారీ అయింది. సముద్ర తీరంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుపాన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. (అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’). సోమవారం నాటికి పెను తుపానుగా మారిన అంఫన్.. సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. దిఘా, బంగ్లాదేశ్ హటియా దీవుల మద్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 155-185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్- బంగాదేశ్ తీరాల వద్ద డిగా, హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంఫాన్ వల్ల ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సముద్ర తీరంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల మధ్య తుపాను కొనసాగుతోంది. ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఈరోజు (మే 18వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో పారదీప్ (ఒరిస్సా)కు దక్షిణ దిశగా 790 కిమీ, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైఋతి దిశగా 940 కిమీ, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1060కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. -
అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర తుపాన్ ‘అంఫన్’.. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత వేగంగా బలపడి సోమవారం సాయంత్రానికి అత్యంత తీవ్ర తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. ఆ తర్వాత మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించనుంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంఫాన్ మే 20 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. రాష్ట్రంలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు. అంఫన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా సోమ, మంగళవారాల్లో గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ వీవీ భాస్కర్ తెలిపారు. అత్యంత తీవ్ర తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్ సిగ్నల్ నంబర్ 5ని జారీచేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
తీవ్ర తుపానుగా ‘ఎంఫన్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం.. ఆ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. మరింత బలపడనున్న ఈ తుఫాన్‌కు వాతావరణ శాఖ ‘ఎంఫన్’గా నామకరణం చేసింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కి.మీ. దూరంలోనూ.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,200 కి.మీ. దూరంలోను.. బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ దిశగా 1,300 కిమీ దూరంలోను కేంద్రీకృతమై ఉంది. మరింత వేగంగా బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా.. మే 18న ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మనపై అంతగా ప్రభావం లేనప్పటికీ.. ► తుఫాన్ మనరాష్ట్రంపై అంత ప్రభావం చూపించకపోయినప్పటికీ తూర్పు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ► గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ బలపడుతున్న సమయంలో 80 కి.మీ. వేగంతో వీస్తాయి. మే 20 తరువాత ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, యానాంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతోపాటు, తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయి. ► రాష్ట్రంలోని పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. -
వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 16న తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం ఒక బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 16 నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐయమ్‌డీ ట్వీట్లను కోట్ చేస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీని గురించి హెచ్చరించింది. దీనితో పాటు మే 15, 16 తేదీలలో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పం నుంచి ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐయమ్‌డీ తెలిపింది. అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది. మే 15న 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడొచ్చని, మే 16న ఈ ప్రాంతంలోనే 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐయమ్‌డీ పేర్కొంది. #CYCLONE ALERT Formation of a Low Pressure area over southeast #BayOfBengal and adjoining south #AndamanSea and its likely intensification into a #CyclonicStorm by 16th May, evening. Source :: @IMDWeather — NDMA India (@ndmaindia) May 13, 2020