న్యూఢిల్లీ : అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’పై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర హోంశాఖ, ఎన్‌డీఎంఏ అధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఆంఫన్ తుపానుపై ఎలా సంసిద్ధమవ్వాలనేదానిపై సమీక్షించాము. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై చర్చించాము. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’ ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారానికి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. అంఫన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ నెల 20 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర వెంబడి 50 కి.మీలు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
(చదవండి : అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’)
Comments
Please login to add a commentAdd a comment