Severe storms
-
Cyclone Mocha: తీవ్ర తుపానుగా ‘మోచా’
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం మలుపు తిరిగి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యాక్‌ప్యూ (మయన్మార్) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీవ్ర తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటవచ్చని పేర్కొంది. చదవండి: మళ్లీ గురివింద నిందలే! రాష్ట్రంలో వడగాడ్పుల ఉధృతి రాష్ట్రంలో ఉష్ణతీవ్రత మరింత పెరుగుతోంది. శుక్రవారం నుంచి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వడగాడ్పులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎండీ హెచ్చరించింది. -
తుపానుపై మోదీ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ : అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’పై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఆంఫన్ తుపానుపై ఎలా సంసిద్ధమవ్వాలనేదానిపై సమీక్షించాము. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై చర్చించాము. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’ ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారానికి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. అంఫన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ నెల 20 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర వెంబడి 50 కి.మీలు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. (చదవండి : అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’) -
‘తుపాను హెచ్చరికలపై అప్రమత్తం చేయాలి’
సాక్షి, శ్రీకాకుళం: తుపాను హెచ్చరికలపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తీర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వలలు, పడవలు నష్టపోకుండా ముందస్తుగా తరలించాలన్నారు. ఆరుబయట పంటలను కాపాడుకునేందుకు, వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని పేర్కొన్నారు. -
అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర తుపాన్ ‘అంఫన్’.. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత వేగంగా బలపడి సోమవారం సాయంత్రానికి అత్యంత తీవ్ర తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. ఆ తర్వాత మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించనుంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంఫాన్ మే 20 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. రాష్ట్రంలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు. అంఫన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా సోమ, మంగళవారాల్లో గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ వీవీ భాస్కర్ తెలిపారు. అత్యంత తీవ్ర తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్ సిగ్నల్ నంబర్ 5ని జారీచేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
దిశ మార్చుకున్న బుల్బుల్ తుపాన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్బుల్ తీవ్ర తుపాను శుక్రవారం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తరదిశగా పయనిస్తున్న ఈ తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. అయితే శనివారం ఉదయం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీన పడనుంది. ఇది శనివారం అర్ధరాత్రి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ శనివారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
చెన్నైకి వర్దా తుఫాను ప్రమాదం
-
వణుకు పుట్టిస్తున్న ’వర్దా’ తుపాను
-
పడగెత్తిన వర్దా
నేటి మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటనున్న పెను తుపాన్.. • గంటకు 100 కి.మీల వేగంతో వీయనున్న ప్రచండగాలులు • దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల్లో భారీ వర్షాలు • నెల్లూరు, ప్రకాశంపై పెను ప్రభావం • పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ • పలు జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్‌లు • తీర ప్రాంత విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం సాక్షి, నెట్వర్క్: ’వర్దా’ అతి తీవ్ర తుపాను వణుకు పుట్టిస్తోంది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, అటు ఉత్తర తమిళనాడులే లక్ష్యంగా పయనిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్దా ప్రతాపం మొదలయింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తీరం వైపునకు చొచ్చుకు వస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి ఇది తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300, నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేపీ తుపానుగా బలహీనపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల మధ్య చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో ఆ ప్రభావిత ప్రాంతాల్లో సముద్ర కెరటాలు సాధారణంకంటే మీటరుకు పైగా ఎత్తుకు ఎగసి పడతాయని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో ఆరో నంబరు అతి ప్రమాద సూచికను, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో 3వ నంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తమిళనాడు సర్కారు అప్రమత్తం వర్దా తుపాను చెన్నైకు సమీపంలోని తీరం దాటనుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాన్ ప్రభావం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల మీద అత్యధికంగా ఉండే అవకాశాలు కన్పిస్తుండడంతో సోమవారం విద్యా సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. తీరప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదేని ప్రళయం చోటుచేసుకుంటే, ప్రజల్ని రక్షించడం, ఆదుకునేందుకు తగ్గ సామగ్రి సిద్ధం చేశారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన తుపాను తీవ్రతకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి పెను తుపాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. విద్యుత్తు సరఫరాకు అంత రాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణి డ్యామ్, బాహుదా ప్రాజెక్టు లాంటి వాటికి గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. తుపాను సమాచారం కోసం విజయవాడ లోని కంట్రోల్‌రూమ్ నంబరు 2488000కు ఫోన్ చేయొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఐదు జిల్లాలకు పంపించారు. మరోవైపు తుపాన్, దానివల్ల కురిసే వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల రైతులు వణికిపోతున్నారు. ఆయా జిల్లాల్లో లక్షల ఎకరాల్లోని వరిపైరులో సగం వరకు కోతలు కోసి కుప్పలు వేసుకున్నారు. ఇప్పుడు భారీ వర్షాలకు పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీహరికోటకు తప్పిన ముప్పు వర్దా తుపాన్ దిశను మార్చుకోవడంతో ఇస్రో ఊపిరిపీల్చుకుంది. ఒక దశలో శ్రీహరికోట వద్ద తీరం దాటుతుందని వాతావరణశాఖ వారు హెచ్చరికలు జారీ చేయడంతో షార్ కేంద్రంలో అన్ని చర్యలు తీసుకున్నారు. 1984లో ఒకమారు శ్రీహరికోట వద్ద తీరం దాటడంతో ఈ ప్రాంతంతో పాటు శ్రీహరికోట కూడా అతలాకుతలమైంది. అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో భారీ నష్టం జరిగింది. ఉప్పాడ తీరంలో కడలి కల్లోలం తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొత్తపల్లి మండల తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. ఆదివారం సాయంత్రం ఉగ్రరూపం దాల్చిన సాగరం ఒక్కసారిగా ముందుకు చొచ్చుకు వచ్చింది. సుమారు 6 మీటర్ల ఎత్తున ఎగసిపడిన కెరటాలు ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డును ఛిద్రం చేశాయి. దీంతో బీచ్‌రోడ్డు సుమారు మూడు కిలోమీటర్ల మేర కోతకు గురైంది. జియోట్యూబ్ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ సైతం పూర్తిగా ధ్వంసమైంది. ఆదివారం ఉపగ్రహ ఛాయాచిత్రంలో వర్దా తీవ్రత వర్దా అంటే గులాబీ హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి సోమవారం తీరాన్ని తాకుతుందని భావిస్తున్న తుపానుకు ‘వర్దా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. వర్దా అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది. తుపాన్లకు పేర్లు పెట్టే పద్దతి కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలైంది. గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న హరికేన్లకు పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏరోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. ఈ పద్ధతి రెండో ప్రపంచ యుద్ధ సమయం వరకు కొనసాగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు ఈ ప్రాంతంలో ఏర్పడిన తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించాయి. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది. ప్రజలు సులభంగా గుర్తుంచుకోవడానికి, ప్రభుత్వాలు నష్టాన్ని అంచనా వేయడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో సౌలభ్యం కోసం ఈ పేర్లు పెట్టే పద్దతిని ప్రవేశపెట్టినట్లు భారత వాతావరణ మండలి పేర్కొంది. -
అతి తీవ్ర తుఫాన్‌గా మారిన 'మాదీ'
విశాఖ:నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాదీ తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తుందని తెలిపింది. దీంతో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్యకారులు వేట వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.