ఔరంగాబాద్‌లో రైలు చక్రాల కంపెనీ
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రూ.200 కోట్ల అంచనాతో రైలు చక్రాల కంపెనీని స్థాపించేందుకు చెక్ కంపెనీ (బొనాట్రన్స్) ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బొనాట్రన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో జోఛిమ్ మర్రేక్ మాట్లాడుతూ తమ కంపెనీ ఆధ్వర్యంలో ఔరంగాబాద్‌లో రైలు చక్రాల కంపెనీ స్థాపించనున్నట్లు తెలిపారు. వచే ఏడాది జనవరిలో కంపెనీ పనులు మొదలవుతాయని, 2015లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. మొదటి దశలో 70 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
బొనాట్రన్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 35 శాతం మార్కెట్ ఉందని, భారత్ రైల్వేకు ఈ ఏడాది సుమారు 10,000 చక్రాలను సరఫరా చేస్తున్నామన్నారు. కంపెనీలో మొదట ఏడాదికి 20 వేల వీల్ సెట్లు, 5 వేల ఏక్సిల్స్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏడాదికి 50 వేల వీల్ సెట్ల తయారీ తమ లక్ష్యమన్నారు. ఈ నవంబర్‌లో ఇండియన్ రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, భారతీయ రైల్వేకు ఏడాదికి మూడు లక్షల చక్రాలు అవసరమవుతాయి. ప్రస్తుతం రైల్వే చక్రాల కోసం చైనా, యూరప్ దేశాలపై మన దేశం ఆధారపడుతోంది. దీంతో మన అవసరాల కోసం స్థానికంగా రైలు చక్రాల తయారీ యూనిట్ల స్థాపనకు ఇండియన్ రైల్వే నడుం బిగించింది. ఇప్పటికే రాయబరేలిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌తో సంయుక్తంగా వీల్ తయారీ కంపెనీని స్థాపించింది. ఇక్కడ ఏడాదికి 50 వేల చక్రాలు తయారు చేస్తారు.