నేను పార్థూ.. నీ పద్దుని
‘శుద్ధబ్రహ్మ పరాత్పర రామా’ పాటతో ఆమె పండిత పామరుల ప్రశంసలు పొందారు. టెలిస్కూల్‌లో నటించి, డబ్బింగ్ చెప్పారు. డైలాగు చిన్నదా పెద్దదా అనే ఎంపిక లేకుండా, వచ్చిన అవకాశాలను తన ఎదుగుదలకు నిచ్చెనగా భావిస్తున్నారు. రఘు మాస్టర్ని వివాహం చేసుకున్నారు. అతడు సినిమాలో ‘నేను పార్థూ.. నీ పద్దుని’ అనే చిన్న డైలాగుతో అందరినీ ఆకర్షించిన ప్రణవి తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు.
టీవీలో ‘భలే డెన్వర్’ పిల్లల కార్టూన్ సీరియల్ 1995 ప్రాంతంలో ప్రసారమైంది. అందులో ప్రధాన పాత్రకు మా అక్క డబ్బింగ్ చెప్పింది. అక్కతో పాటు నేను కూడా వెళ్లేదాన్ని. నాతో చిన్న చిన్న డైలాగులు చెప్పించేవారు. డబ్బింగ్‌కి వెళ్లడానికి మరో కారణం స్టూడియో పక్కనే ఉన్న స్వాతి టిఫిన్ సెంటర్లో దొరికే ఇడ్లీ. ఆ వయసులో నాకు డబ్బింగ్ కంటె ఇడ్లీనే ప్రధానం. అలా ఇడ్లీ మీద ప్రేమతో డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది. నేను బిఏ మ్యూజిక్ చేశాక, సంగీతంలోనే డిప్లొమా చేసి డిస్టిన్క్షన్లో పాసయ్యాను. మా నాన్నగారు విజయ్‌కుమార్ తెలుగు పండిట్ . టీచర్‌గా పనిచేస్తూ, దూరదర్శన్‌లో అనౌన్సర్‌గా కూడా పని చేశారు. ఆయన డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
టెలిస్కూల్‌లో...
నాన్నగారు దూరదర్శన్ వారి టెలిస్కూల్ కార్యక్రమాలు దాదాపు 700లకు పైగా చేశారు. ఆరోజులలో నాన్నగారితో కలిసి దూరదర్శన్‌కి వెళ్లేదాన్ని. అలా టెలిస్కూల్‌లో నాలుగు వందల కార్యక్రమాలలో పాల్గొన్నాను.
సీరియల్స్‌లో...
టీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘కళంకిత’లో మూడు పాత్రలు, ‘అన్వేషిత’లో ప్రధాన పాత్రకు, ‘విధి’, ‘అందం’... సీరియల్స్‌లో చాలా పాత్రలకు డబ్బింగ్ చెబుతూ ఎదిగాను. ‘మాతృదేవోభవ’ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన బాబుకి డబ్బింగ్ చెప్పాను. ఆ సీరియల్‌కి చెన్నై నుంచి సంతోష్ శివమ్ గారు దగ్గరుండి డబ్బింగ్ చెప్పించారు.
నా గొంతు నచ్చి ‘హేలో’ సినిమా కోసం వాయిస్ టెస్టింగ్‌కి చెన్నై రమ్మన్నారు. నేను మా చెల్లి ఇద్దరం వెళ్లాం. వాస్తవానికి మా చెల్లెలు మెయిన్ క్యారెక్టర్‌కి, పక్కనున్న ఫ్రెండ్‌కి నేను చెప్పాలి. కాని రివర్స్ అయ్యింది. చాలా కష్టపడి చెప్పాను. ఆ సినిమాకి జాతీయ అవార్డు చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్లో బహుమతులు వచ్చాయి. అదే చిత్రంలో ప్రధాన పాత్రకు ఒక పాట ఉంది. ఆ పాటలో నేను అక్కడక్కడ హమ్మింగ్ చేశాను.
అప్పుడు ఆ చిత్ర దర్శకులు సంతోష్ శివమ్ ‘ఈ పాటను ఈ అమ్మాయితో పాడించండి, సరిగా పాడకపోతే వేరే వారితో పాడించండి’ అన్నారు. ఆ పాటను ప్రముఖ గాయకులు జి.ఆనంద్ కండక్ట్ చేశారు. పాట పావుగంటలో అయిపోయింది. ‘మనసులోని చిన్న మాట హేలో హేలో అన్నదంట’ అనే పల్లవితో ఉన్న ఆ పాటతో నా ఆరో తరగతిలో సింగింగ్ కెరీర్ ప్రారంభమైంది.
నాకు పరీక్షా సమయమే...
పదో తరగతి పరీక్షలు జరుగుతున్న టైమ్‌లో ‘శివలీలలు’ సీరియల్లో మార్కండేయుడి పాత్రకు డబ్బింగ్ చెప్పాలి. పరీక్షలు రాయడం, డబ్బింగ్ చెప్పడం. అష్టకష్టాలు పడ్డాను. రాత్రి ఒంటి గంటకు చదువుకునేదాన్ని. చదువు విషయంలో అమ్మ బాగా శ్రద్ధ చూపింది.
నటిస్తూ డబ్బింగ్...
ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలందరికీ వాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు నేను డబ్బింగ్ చెప్పాను. ‘కలవారి కోడలు కనకమాలక్ష్మి’ సినిమాలో ఇంద్రజ చిన్నప్పటి పాత్రలో నటిస్తూ, డబ్బింగ్ చెప్పుకున్నాను. అదే సినిమాలో చిన్నప్పటి సాయికుమార్ పాత్రకు, సాయికుమార్ చెల్లెలిగా నటించిన రాశి కొడుకు పాత్రకు, మరో ప్రధాన పాత్రకు ... ఒకేసారి నాలుగు గొంతులకు మార్చి మారి చెప్పడంతో, కొద్దిగా గొంతు నొప్పి వచ్చింది. కాని చివరికి నాకు తృప్తి మిగిలింది.
ఒకేసారి చాలామందికి...
‘సత్యం’ సినిమాలో హీరోయిన్‌కి తప్పించి మిగిలినవారందరికీ నేనే డబ్బింగ్ చెప్పాను. నేను చెప్పేది, చిన్న బిట్ అని కాని, ఏ క్యారెక్టర్ అని కాని ఆలోచించను. వర్క్ ప్రధానం నాకు అంతే. ఆ సినిమా అంతా నా గొంతే వినిపిస్తుంది. అదొక అందమైన అనుభవం.
అతడు చిత్రంలో...
‘అతడు’ సినిమాలో త్రిష అందరినీ పరిచయం చేస్తుంటే, ‘పార్థూ! నేను నీ పద్దుని’ అని త్రిష స్నేహితురాలు చెప్పే డైలాగు నేనే చెప్పాను. ఆ రోజు కూడా నేను పరీక్ష అయ్యాక వచ్చి ఆ డైలాగు చెప్పాను. అది నాకు చాలా ప్రత్యేకం. అది చిన్నదే అయి ఉండొచ్చు, కాని నా గొంతుతోనే ఈ మాట చెప్పించాలనుకోవడం, నాకు చాలా సంతోషం కలిగించింది.
మనసంతా నువ్వే...
విఎన్ ఆదిత్య ‘మనసంతా నువ్వే’ చిత్రంలో ఒక పాత్రకు గొంతు ఇచ్చాను. ఒకసారి బయట కూర్చుని నాలో నేను పాడుకుంటున్నాను. అది చూసి ఆదిత్య నాతో రెండు పాటలు రికార్డు చేయించి, సంగీత దర్శకులు కల్యాణి మాలిక్‌కి వినిపించారు. ‘ఆంధ్రుడు’ చిత్రంలో ‘వైష్ణవి భార్గవి’, ‘కోకిలమ్మా బడాయి చాలింక’ పాటలలో రెండు బిట్స్ పాడాను. అలా పాడటం ప్రారంభించాను.
హీరోయిన్లకు కుదరదు...
ఇప్పుడు వస్తున్న హీరోయిన్లకి నా గొంతు సరిగా కుదరదు, నా గొంతు కొంచెం పెక్యులియర్‌గా ఉండటం వల్ల అందరికీ సూట్ కాదు. ఈ మాట చాలా మంది చెప్పారు. నా గొంతు ఎస్.పి. శైలజగారు స్టార్టింగ్‌లో ఉన్న గొంతులా ఉందని చాలామంది అన్నారు. త్వరలో రాబోతున్న ఒక చిత్రంలో ‘కృతీ కర్బందా’కి డబ్బింగ్ చెప్పాను. నాది కొంచెం కంగుమనే గొంతు, సో హీరోయిన్ల భావాలు కూడా టంగ్ మంటేనే నా టంగుమనే గొంతు సరిపడుతుంది. ఇప్పుడు పాటలు ఎక్కువగా పాడుతుండటం వల్ల డబ్బింగులు తగ్గుతున్నాయి.
డబ్బింగ్ ఉపయోగపడింది...
నేను చాలాకాలం డబ్బింగ్ చెప్పడం, నాకు పాటలు భావయుక్తంగా పాడటానికి ఉపయోగపడింది. పాటలలో నవ్వడం కూడా బాగా తేలికైంది. డబ్బింగ్లోను, పాటలలోను రెంటిలోనూ పరిచయం ఉండటం అనేది మా తల్లిదండ్రుల కారణంగానే వచ్చింది. వారికి నా ధన్యవాదాలు.
నటిగా...
‘శుభ ముహూర్తం’, ‘హిట్లర్’ వంటి ఒకటి రెండు చిత్రాలలో, ఇంకా కొన్ని తెలుగు సీరియల్స్‌లో, ముఖ్యంగా ఒక కన్నడలో సీరియల్లో కూడా నటించాను. దూరదర్శన్ నాటకాలలో, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, అశ్వని హెయిర్ ఆయిల్, రిలాక్స్వెల్ మాట్రెసెస్ వంటి ప్రకటనలలో, బాల్యవివాహాలు, చదువుకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనలలో నటించాను.
ఆ తరవాత యాక్టింగ్ మానేశాను. చదువు, డబ్బింగ్లో నిలబడి పోయాను.ఇప్పటివరకు ఐదారు వందల సినిమాలకు చైల్డ్ ఆర్టిస్టుగాను, యంగ్గాను డబ్బింగ్ చెప్పాను. నాకు సెట్ అయిన క్యారెక్టర్లు కాని, సెట్ అయిన హీరోయిన్లకు గాని ఇస్తూనే ఉన్నాను. ‘తూర్పువెళ్లే రైలు’ సీరియల్‌కి మొదటి నంది అందుకున్నాను. ఆ తరవాత ‘మనసు మమత’, ‘గీతాంజలి’ సీరియల్స్‌కి కూడా నంది అవార్డులు అందుకున్నాను.
నా మనసు దోచిన డబ్బింగ్...
నా హృదయానికి బాగా దగ్గరగా ఉన్నది డబ్బింగ్. నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది నాకు ఒక జీవితాన్ని ఇచ్చి, సినిమాలలోకి నడిపింది. సంగీతం వైపుగా నడిచింది కూడా ఇదే. నేను రఘు మాస్టర్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే కదా. – ప్రణవి, డబ్బింగ్ ఆర్టిస్టు, సింగర్
– ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ