ప్రమాదకర ధోరణి కొనసాగుతోంది
ముంబై: దేశంలో ఉదారవాదులు, విమర్శకులను అందరినీ హతమార్చడం అనే ప్రమాదకరమైన ధోరణి కొనసాగుతోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యల వల్ల దేశం అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలవుతోందని వెల్లడించింది. హేతువాదులు గోవింద్ పన్సారే, దబోల్కర్ల హత్యల విచారణల్ని కోర్టు పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ భారతి దంగ్రేల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
‘దేశంలో ఉదారవాద విలువలకు, అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. ప్రజలు తమ ఉదారవాద సిద్ధాంతాల ఆధారంగా దాడులకు గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కేవలం వీరే కాకుండా ఉదారవాదాన్ని నమ్మే వ్యక్తులు, సంస్థలను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని హైకోర్టు పేర్కొంది. పన్సారే, దబోల్కర్ల హత్యల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో పాటు మహారాష్ట్ర సీఐడీలు గురువారం చార్జిషీట్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా బలమైన సాక్ష్యాధారాలను సేకరించడంలో సీబీఐతో పాటు రాష్ట్ర సీఐడీ కూడా విఫలమయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.