daily newspaper
-
అన్నాడీఎంకేకు సొంత చానల్, పత్రిక!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ సొంత టీవీ చానల్, దిన పత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతిపక్ష డీఎంకేతో పాటు ఇటీవలే ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీటీవీ దినకరన్‌కూ సొంత ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి కూడా సొంత మీడియా ఉండాలని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సొంత మీడియా ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తొలిసారిగా హాజరుకానున్న దినకరన్‌ను చూసి నవ్వడం, మాట్లాడటం చేయరాదని ఎమ్మెల్యేలను ఎడపాడి, పన్నీర్ ఆదేశించారు. -
సినిమా పిచ్చిలో పడి...
కనువిప్పు సినిమాలు చూడడం అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి? ఈ విషయంలో నాది రెట్టింపు ఆసక్తి. ఊళ్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల భయం చేత ఎప్పుడోగానీ సినిమాలకు వెళ్లేవాడిని కాదు. అది కూడా మా నాన్న- ‘‘ఫలానా సినిమా బాగుందట. వెళ్లు’’ అని చెబితేగానీ వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే కాలేజీ చదువు కోసం సిటీకి వచ్చానో... ఇక నాకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూడడం మొదలైంది. దినపత్రికల సినిమా పేజీలలో డెరైక్టర్ల ఇంటర్వ్యూలు శ్రద్ధగా చదివేవాడిని. ఎన్నో కష్టాలు పడి వాళ్లు పైకి వచ్చిన తీరు నన్ను బాగా ఆకర్షించేది. ‘నేను కూడా అలా కష్టపడి... పెద్ద డెరైక్టర్నవుతా’ అనే ఆలోచన వచ్చింది. దీంతో చదువు వెనకబడింది. చదువుకోవాల్సిన సమయంలో సినిమాలకు కథలు రాస్తూ కూర్చొనేవాడిని. ‘‘కాలేజీలో చదువుకోవడానికి వచ్చావా? కథలు రాయడానికి వచ్చావా? మీ నాన్నకు తెలిస్తే ఎంత బాధ పడతారు?’’ అని మా రూమ్మేట్ శ్రీనివాసరావు నాలుగు మంచి మాటలు చెప్పబోతే వాడితో గొడవ పడ్డాను. ‘‘నీ పనేదో నువ్వు చూసుకో... నోరు మూసుకో’’ అని తిట్టాను కూడా. అప్పు చేసిన డబ్బులతో, నా దగ్గర ఉన్న కథలతో ఫిల్మ్‌నగర్ చుట్టూ తిరిగాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. రెండు రోజులకే డబ్బులయిపోయాయి. వెనక్కి వెళ్లేది లేదు. తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాను. ఒక హోటల్లో పనికి కుదిరాను. నా అదృష్టమో, దురదృష్టమోగానీ ఒకరోజు వరుసకు బాబాయ్ అయ్యే నాగరాజుగారి కంట్లో పడ్డాను. అప్పటికింకా ఆయనకు పెళ్లి కాలేదు. ప్రభుత్వ ఉద్యోగమేదో చేస్తున్నాడు. ‘‘నాతో రా’’ అని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాడు. ‘‘నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. అయితే కొద్దిరోజుల తరువాత నేను చేస్తున్నది తప్పనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. చదువు మీద దృష్టి పెట్టక పోవడం అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను పచ్చిగా మోసం చేయడమే. ఆ రోజు నేను మారి ఉండకపోతే ఈరోజు నీలాగే ఏదో ఒక హోటల్లో పనిచేస్తూ ఉండేవాడిని’’ ఇలా నా బ్రెయిన్ వాష్ చేశారు. నాణేనికి ఒక వైపు మాత్రమే చూసిన నాకు రెండో వైపు చూపించారు. కళ్లు తెరిపించారు. ఇవ్వాళ నేను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే అది ఆయన వల్లే. - యం.విక్రమ్, చిత్తూరు