సినిమా పిచ్చిలో పడి... | I fell into the madness of ... | Sakshi
Sakshi News home page

సినిమా పిచ్చిలో పడి...

Published Wed, May 7 2014 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

సినిమా పిచ్చిలో పడి... - Sakshi

సినిమా పిచ్చిలో పడి...

కనువిప్పు
 
సినిమాలు చూడడం అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి? ఈ విషయంలో నాది రెట్టింపు ఆసక్తి. ఊళ్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల భయం చేత ఎప్పుడోగానీ సినిమాలకు వెళ్లేవాడిని కాదు. అది కూడా మా నాన్న-
 
‘‘ఫలానా సినిమా బాగుందట. వెళ్లు’’ అని చెబితేగానీ వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే కాలేజీ చదువు కోసం సిటీకి వచ్చానో... ఇక నాకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూడడం మొదలైంది. దినపత్రికల సినిమా పేజీలలో డెరైక్టర్ల ఇంటర్వ్యూలు శ్రద్ధగా చదివేవాడిని. ఎన్నో కష్టాలు పడి వాళ్లు పైకి వచ్చిన తీరు నన్ను బాగా ఆకర్షించేది.
 
‘నేను కూడా అలా కష్టపడి... పెద్ద డెరైక్టర్‌నవుతా’ అనే ఆలోచన వచ్చింది. దీంతో చదువు వెనకబడింది. చదువుకోవాల్సిన సమయంలో సినిమాలకు కథలు రాస్తూ కూర్చొనేవాడిని.
 
‘‘కాలేజీలో చదువుకోవడానికి వచ్చావా? కథలు రాయడానికి వచ్చావా? మీ నాన్నకు తెలిస్తే ఎంత బాధ పడతారు?’’ అని మా రూమ్‌మేట్ శ్రీనివాసరావు నాలుగు మంచి మాటలు చెప్పబోతే వాడితో గొడవ పడ్డాను. ‘‘నీ పనేదో నువ్వు చూసుకో... నోరు మూసుకో’’ అని తిట్టాను కూడా.
 
అప్పు చేసిన డబ్బులతో, నా దగ్గర ఉన్న కథలతో ఫిల్మ్‌నగర్ చుట్టూ తిరిగాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. రెండు రోజులకే డబ్బులయిపోయాయి. వెనక్కి వెళ్లేది లేదు. తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాను. ఒక హోటల్‌లో పనికి కుదిరాను. నా అదృష్టమో, దురదృష్టమోగానీ ఒకరోజు వరుసకు బాబాయ్ అయ్యే నాగరాజుగారి కంట్లో పడ్డాను. అప్పటికింకా ఆయనకు పెళ్లి కాలేదు. ప్రభుత్వ ఉద్యోగమేదో చేస్తున్నాడు. ‘‘నాతో రా’’ అని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాడు.
 
‘‘నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. అయితే కొద్దిరోజుల తరువాత నేను చేస్తున్నది తప్పనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. చదువు మీద దృష్టి పెట్టక పోవడం అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను పచ్చిగా మోసం చేయడమే. ఆ రోజు నేను మారి ఉండకపోతే ఈరోజు నీలాగే ఏదో ఒక హోటల్లో పనిచేస్తూ ఉండేవాడిని’’ ఇలా నా బ్రెయిన్ వాష్ చేశారు. నాణేనికి ఒక వైపు మాత్రమే చూసిన నాకు రెండో వైపు చూపించారు. కళ్లు తెరిపించారు. ఇవ్వాళ నేను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే అది ఆయన వల్లే.

 - యం.విక్రమ్, చిత్తూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement