Dalda
-
ఖాళీ డాల్డా ప్యాకెట్లను కరిగించి మళ్లీ..
అంబర్‌పేట: హోటళ్లు, బేకరీల్లో వాడిపడేసిన డాల్డా ప్యాకెట్ల వేడిచేసి... అందులో మిగిలి ఉన్న డాల్డాను సేకరించడం.. దానికి వేరే పదార్థాలు కలిపి నకిలీ డాల్డా తయారు చేసి విక్రయించడం.. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఓ తయారీ కేంద్రంపై జీహెచ్ఎంసీ అధికారులు శనివారం దాడి చేశారు. జీహెచ్ఎంసీ ఎఎంహెచ్ఓ డాక్టర్ హనుమంతారావు, స్థానికుల కథనం ప్రకారం... మలక్‌పేట అఫ్జల్‌నగర్ నివాసి ఎండీ వశీం గోల్నాక తులసీనగర్ లంకబస్తీలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకున్నాడు. హోటళ్లు, బేకరీల్లో వినియోగించిపడేసిన డాల్డా ప్యాకెట్లను సేకరిస్తున్నాడు. వాటిని వేడి చేసి అందులో మిగిలి ఉన్న డాల్డాను డ్రమ్ముల్లో నింపి విక్రయిస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్లను కరిగించి ప్లాస్టిక్ వైర్లు తయారు చేస్తున్నాడు. కవర్లను కరిగిస్తున్న సమయంలో భరించలేని వాసన, విషవాయులు వెలువడుతుండటంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం సర్కిల్–9బి ఎఎంహెచ్ఓ హనుమంతారావు తన సిబ్బందితో వెళ్లి ఆ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ తయారవుతున్న డాల్డా శాంపిల్స్ సేకరించారు. వీటి పరీక్షల్లో వచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేంద్రానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేకపోవడంతో రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు షెడ్‌ను సీజ్ చేశారు. నిర్వాహకులు మాత్రం తాము తయారు చేసేది డాల్డా కాదని, సబ్బుల తయారీకి అవసరమైన ముడిసరుకు మాత్రమేనని కొద్దిసేపు అధికారులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. -
కల్తీనెయ్యి స్థావరంపై పోలీసుల దాడి
* 1500 కిలోల డాల్డా స్వాధీనం * మూడు వేల కిలోల పామాయిల్, * 600 కిలోల కల్తీ నెయ్యి కూడా.. శామీర్‌పేట్: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై గురువారం పోలీసులు దాడి చేశారు. 1500 కిలోల డాల్డా, మూడు వేల పామాయిల్ ప్యాకెట్లు, 600 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ సీఐ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. తూంకుంట గ్రామానికి చెందిన వీర్రాజు తన ఇంట్లో (ప్లాట్‌నంబర్ 4-23/5/3లో కొంతకాలంగా యశోద, కృష్ణ, శ్రీలక్ష్మీఫుడ్స్ కంపెనీ పేరుతో నకిలీ నెయ్యి తయారుచేసి అమ్ముతున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు గురువారం వీర్రాజు ఇంటిపై దాడులు చేశారు. కల్తీనెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడి కావడంతో స్థావరాలను సీజ్ చేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1500 కిలోల డాల్డా, మూడు వేల కేజీల పామాయిల్, 600 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 12 సంవత్సరాలుగా కల్తీనెయ్యి దందా జరుగుతున్నట్టు తయారీదారులు చెప్పారని సీఐ తెలిపారు. పోలీసులు దాడిచేసిన సమయంలో కల్తీ నెయ్యి తయారీదారు వీర్రాజు ఇంట్లో లేకపోవడంతో అతడి కుమారులు భరత్, అలోక్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని శామీర్‌పేట్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. దాడిలో ఎస్ఓటీ ఎస్ఐ వసంత్, శామీర్‌పేట్ సీఐ సత్తయ్య, ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.